ఉత్తరాఖండ్‌కు చెందిన నరైన్ సింగ్ అనే వ్యక్తి 1982 నవంబర్ 30న ఆర్మీలో శ్యామ్ సింగ్ పేరుతో చేరాడు. అది నరైన్ సింగ్ సోదరుడి పేరు. అనంతరం 13గార్డ్స్ బెటాలియన్‌లో సైనికుడిగా విధులు నిర్వర్తించాడు. 2001 జూన్ 30న నాయక్ పోస్టులో రిటైర్ అయ్యాడు. 2002 మార్చిలో డీఎస్సీలో (డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్) చేరాడు. అలా ఆయనకు రెండు పెన్షన్లు వచ్చాయి. డీఎస్సీ సేవలో ఉన్నప్పుడు పింఛను కోసం ఆధార్, పాన్‌ను బ్యాంకు ఖాతాకు జతచేశాడు. 2018 జులై 1న సేవల నుంచి తప్పుకున్నాడు.
కాగా.. రెండు వేరువేరు ఫొటోలతో.. ఒకే పేరు(శ్యామ్ సింగ్), ఒకే తండ్రి పేరు(మదన్ సింగ్), ఒకటే పుట్టిన రోజు(1963 జులై 11) మీద రెండు పాన్ కార్డులు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. 2017 మేలో నరైన్ సింగ్ ఆర్మీ పింఛను నిలిచిపోయింది. కొన్ని రోజులకు డీఎస్సీ పింఛను కూడా ఆగిపోయింది.
విచారణలో భాగంగా.. శ్యామ్ సింగ్ అనేది నిందితుడు నరైన్ సోదరుడి పేరని తేలింది. శ్యామ్ సింగ్ కూడా ఆర్మీలో సేవలందించాడు. 1982 మార్చిలో ఆయన ఆర్మీలో చేరాడు. 2002 జనవరిలో.. హవిల్దార్ పదవిలో రిటైర్ అయ్యాడు. 2017 ఏప్రిల్‌లో.. తన బ్యాంకు ఖాతాకు పాన్ కార్డును అనుసంధానించుకోవాలని ఉత్తరాఖండ్ ఎస్బీఐ కాశీపుర్ బ్రాంచ్ నుంచి విజ్ఞప్తి వచ్చింది. అదే సమయంలో అల్మోర్ జిల్లాలోని ఎస్బీఐ రాంపుర్ బ్రాంచ్‌లో శ్యామ్ సింగ్ పేరుతో బ్యాంకు ఖాతాకు పాన్ అనుసంధానించినట్టు తెలిసింది. ఏదో తేడా జరుగుతున్నట్టు గమనించిన అధికారులు పింఛన్లు నిలిపివేశారు.