సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అవ్వాలని చాలా మంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం మూగజీవాలనూ వదలట్లేదు. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. ముగ్గురు వ్యక్తులు కలిసి పామును హింసించి.. చంపారు. ఆ వీడియోను తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
తమిళనాడు అరక్కోణంకు చెందిన ముగ్గురు స్నేహితులు కలిసి.. బతికున్న పామును పట్టుకున్నారు. అనంతరం మోహన్ అనే వ్యక్తి చేతిపై పాము కాటు వేసింది. దీంతో మోహన్ దాని తల భాగాన్ని కొరికాడు. కాటు వేసిన పాముపై ప్రతీకారం తీర్చుకోవాలని వీడియోలో చెప్పాడు. ఆ యువకుడికి మరో ఇద్దరు అండగా నిలిచారు. పాము తలను మోహన్ కొరుకుతున్నప్పుడు వారంతా నవ్వులు చిందించారు.
పామును హింసించి.. దాని తల కొరుకుతున్న దృశ్యాలను సెల్ఫోన్ కెమెరాతో చిత్రీకరించారు. అనంతరం ఫేస్బుక్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో పామును హింసిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో పర్యావరణ కార్యకర్తల దృష్టికి చేరింది. వారు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మోహన్, సూర్య, సంతోశ్ అనే ముగ్గురు నిందితులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. వన్యప్రాణులను వేధించడం, పాము మరణానికి కారణమైనందుకు వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నామని అటవీ అధికారులు తెలిపారు.