Mamata On Chandrababu Arrest : తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు. చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపులా కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఏదైనా తప్పు జరిగితే విచారణ జరపాలన్న దీదీ.. కక్షసాధింపు ధోరణి సరికాదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇది బూమ్‌రాంగ్ అవుతుందని తెలిపారు.
"ఇది రాజకీయ కక్షసాధింపు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇలా చేస్తే రేపు మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. వారు కూడా అలాగే చేస్తారు. ఇలా చేయడం సరికాదని నా భావన. మేం ఎప్పుడూ ఇలా చేయలేదు. బంగాల్‌లో సీపీఎం 34 ఏళ్లపాటు అధికారంలో ఉంది. వారి ముఖ్యమంత్రి, హోంమంత్రుల గురించి మా వద్ద చాలా సమాచారం ఉంది. కానీ మేం వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదు. చంద్రబాబునాయుడిని అరెస్టు చేశారు. నేను దానిని సమర్థించలేదు. ఏదైనా తప్పు జరిగితే మాట్లాడండి, తనిఖీలు చేయండి, విచారణ జరపండి. అధికారం మీ చేతిలో ఉంది. కానీ కక్షసాధింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదు. రాబోయే కాలంలో ఇది బూమ్‌రాంగ్ అవుతుంది."
--మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
'అభిషేక్ బెనర్జీని కూడా కేంద్రం వేధిస్తోంది'
Mamata On Central Government :ఐదేళ్ల తర్వాత విదేశీ పర్యటకు వెళ్తున్న సందర్భంగా.. పలు అంశాలపై దీదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. "ఐదేళ్ల తర్వాత విదేశాలకు వెళ్తున్నాను. విదేశాల నుంచి ఇదివరకు ఎన్నో ఆహ్వానాలు వచ్చినప్పటికీ ఇక్కడ అనుమతి ఇవ్వలేదు. దిల్లీ పోలీసులు మాకు శత్రువులు కాదు. కానీ, రాజకీయంగా ఆందోళనలకు పిలుపునిచ్చినందున అక్కడకు వెళ్లేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ రాజ్‌ఘాట్‌కు వెళ్లి నివాళి అర్పిస్తాం. బంగాల్‌లో అభిషేక్ బెనర్జీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాగే వేధిస్తోంది. ఓ యువ నాయకుడిని అణచివేసేందుకు కేంద్రం ఈ తరహా చర్యలకు దిగుతోంది" అని మమతా బెనర్జీ ఆరోపించారు.
దిల్లీ టీఎంసీ ఆందోళనలు..
TMC Protest :బంగాల్‌కు ఎన్‌ఆర్‌ఈజీఏ నిధులను మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ దిల్లీలో ఆందోళన చేపట్టేందుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధమైంది. దిల్లీలోని రాజ్‌ఘాట్‌తో సహా మూడుచోట్ల అక్టోబర్ 2న ఆందోళనలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను ముఖ్యమంత్రి మమత.. దుబాయ్, స్పెయిన్‌లలో పర్యటించనున్నారు. మంగళవారం ఆమె విదేశీ ప్రయాణం మొదలుకానుంది.
'సాయం కోరుతూ అమిత్ షాకు మమత ఫోన్!'.. రాజీనామా చేస్తానని దీదీ సవాల్
'EVMలను బీజేపీ హ్యాక్ చేస్తోంది.. మా వద్ద ఆధారాలున్నాయ్'.. మమత సంచలన ఆరోపణలు