Maharashtra politics SC hearing: శివసేన ఎమ్మెల్యేలు, ఆ పార్టీ రెబల్స్ దాఖలు చేసిన పిటిషన్లపై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపు, అనర్హత, పార్టీ విలీనం అంశాలపై ఈ వ్యాజ్యాలు అనేక రాజ్యాంగపరమైన ప్రశ్నలు లేవెనత్తుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీటిపై విస్తృత ధర్మాసనం పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. వచ్చే బుధవారం (జులై 27) నాటికి అన్ని పార్టీలు తమ సమస్యలపై వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్నాథ్ శిందే వర్గం ఎమ్మెల్యేలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్.. పార్టీ నియమించిన విప్‌కు బదులుగా ఇతరులను విప్‌గా గుర్తించడాన్ని ఠాక్రే తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తప్పుబట్టారు. ఇది పదో షెడ్యూల్‌కు విరుద్ధమని, ప్రజల తీర్పునకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ నుంచి దూరమైన ఓ వ్యక్తి(శిందే)తో గవర్నర్.. ప్రమాణస్వీకారం చేయించడం సరికాదని వాదించారు.