Maharashtra Drugs Case Latest News : మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న గిర్నా నది అడుగు భాగంలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సోమవారం అర్ధరాత్రి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి వీటిని గుర్తించారు. అధికారుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఈ దాడులు జరిపారు పోలీసులు. ముంబయి, డియోలా పోలీసుల అధ్వర్యంలో ఈ ప్రత్యేక ఆపరేషన్ జరిగింది.
ఇటీవలె నాసిక్ జిల్లాలోని శిందే గ్రామంలో ఓ ఔషధ తయారీ కేంద్రంపై దాడులు చేపట్టారు పోలీసులు. అనంతరం రూ.300 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను సీజ్ చేశారు. రెండు నెలల పాటు ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన ముంబయి పోలీసులు.. డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. ఆ సమయంలో ఈ కేసుతో సంబంధమున్న లలిత్ పాటిల్ అనే వ్యక్తి పరారీలో ఉండగా.. అతడి కోసం తీవ్రంగా గాలించి కొద్ది రోజుల క్రితమే చెన్నైలో అరెస్ట్ చేశారు పోలీసులు. లలిత్ పాటిల్‌తో పాటు అతడి కారు డ్రైవర్ సచిన్ వాగ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారీ మొత్తంలో డ్రగ్‌ను గిర్నా నదిలో పడేసినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు సచిన్ వాగ్. నాసిక్‌లోని దేవ్లా తాలూకాలోని లోహ్నర్ థెగోడా వద్ద నదిలో ఈ డ్రగ్స్ విసిరేశారనే సమాచారాన్ని ఇచ్చాడు. దీంతో ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. "సోమవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో.. నది అడుగు భాగంలో కొన్ని డ్రగ్స్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నాం. ఉదయం వరకు సోదాలు కొనసాగించాం. ఈ డ్రగ్స్ విలువ దాదాపు కోట్లలో ఉంటుంది." అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరుపుతామని వారు వెల్లడించారు.