జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ రూపంలో భారత న్యాయవ్యవస్థ అపార అనుభవమున్న ఓ న్యాయమూర్తిని కోల్పోయిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. జస్టిస్ నారీమన్ పదవీ విరమణ వీడ్కోలు సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"2014 జులై 7న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ నారీమన్.. తన ఏడేళ్ల కాలంలో 13,500 కేసులను పరిష్కరించారు. అందులో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి పోలీసులకు అరెస్ట్ చేసే అధికారమిచ్చే ఐటీ చట్టంలోని నిబంధన కొట్టివేత, స్వలింగ సంపర్కం నేరం కాదని, శబరిమల ఆలయంలో అన్ని వయసు మహిళల ప్రవేశం వంటి చారిత్రక తీర్పులు ఉన్నాయి. ఆయన పదవీ విరమణతో న్యాయవ్యవస్థకు రక్షణగా ఉన్న సింహాల్లో ఒకదాన్ని కోల్పోయామని నాకనిపిస్తోంది."