ఇటీవలి కాలంలో సైబర్ దాడులు పెరిగిపోయాయి. రోజు రోజుకు వాటి నుంచి ముప్పు అధికమవుతోంది. ఈ క్రమంలో సైబర్ దాడులను అరికట్టేందుకు భారత్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 'జాతీయ సైబర్ భద్రతా వ్యూహం'(ఎన్సీఎస్ఎస్)ను కొద్ది రోజుల్లోనే అమలులోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల భారత్‌లోని విద్యుత్తు రంగ సంస్థలపై చైనా ఆధారిత సంస్థలు సైబర్ దాడులు చేశాయన్న వార్తల నేపథ్యంలో.. భారత సైబర్ భద్రతా విధానాన్ని సత్వరమే అమలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
ఈ విషయంపై ఈటీవీ భారత్‌తో మాట్లాడారు భారత జాతీయ సైబర్ భద్రతా కోఆర్డినేటర్, లెఫ్టినెంట్ జనరల్ రాజేశ్ పంత్.
" మన కొత్త వ్యూహం ఎన్సీఎస్ఎస్ త్వరలోనే అమలులోకి రానుంది. పూర్తి వ్యవస్థను ఏ విధంగా రక్షించుకోవచ్చు అనేది ఇందులో పొందుపరిచాం. కొత్త వ్యూహంపై అన్ని పనులు పూర్తయ్యాయి. కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం పంపించాం. నెల లేదా రెండు నెలల్లో అమలులోకి వస్తుంది.
అంతర్జాల ఆధారిత కంప్యూటర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పలు లింకులపై క్లిక్ చేసేలా సైబర్ నేరగాళ్లు ఉచ్చు పన్నుతారు. వాటిని క్లిక్ చేస్తే మాల్వేర్ కంప్యూటర్లోకి చేరుతుంది. అక్కడి నుంచి ఇతర కంప్యూటర్లలోకి వెళుతుంది. అడ్మిన్ వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను హ్యాక్ చేయలేదు. ఐటీపై అధికంగా ఆధారపడుతున్నందున భారత్‌లోని ప్రతి రంగం సైబర్ సెక్యూరిటీ కేంద్రాన్ని కలిగి ఉండాలి."