పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజే ఉభయసభల్లో వాయిదాలపర్వం కొనసాగింది. పెట్రో, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ.. విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే మంగళవారానికి వాయిదా పడ్డాయి.
రాజ్యసభలో..
ఉదయం 9 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తర్వాత సభ కాసేపు సజావుగా సాగింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఛైర్మన్ వెంకయ్యనాయుడు అతివల విజయాలను కొనియాడారు. అనంతరం అజెండాలోని అంశాలను పక్కనపెట్టి.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచడంపై చర్చించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నోటీసు ఇచ్చారు. కానీ ఛైర్మన్ వెంకయ్య నాయుడు చర్చకు అనుమతించలేదు. ఈ విషయం తర్వాత చర్చిద్దామని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం క్వశ్చన్ అవర్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ప్రతిపక్షాలు వెల్‌లోకి వెళ్లి ఆందోళనకు దిగాయి. తక్షణమే ఈ విషయంపై చర్చ జరపాలని పట్టుబట్టాయి. ప్రతిపక్ష సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తొలిరోజే సభ్యులను సస్పెండ్ చేయాలనుకోవడం లేదని వెంకయ్య నాయుడు హెచ్చరించారు. అయినా ప్రతిపక్ష నేతలు ఆందోళన కొనసాగించారు. దీంతో తొలుత సభ ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది.
అనంతరం సభ తిరిగి ప్రారంభమైన ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు విరమించలేదు. దీంతో డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సభను మరోసారి మధ్యాహ్నం 1గంటకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన కొద్ది సేపటికే.. మరుసటి రోజుకు వాయిదా పడింది.