జమ్ముకశ్మీర్లో ఈ నెలలో ఎన్నికల సంఘం పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడి వాతావరణం వెడెక్కింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఏడాది ఎన్నికలు జరుగుతాయంటూ అశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు తాము సిద్ధమని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యలు.. ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతంలో రాజకీయ శూన్యత ఉందని.. దానిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు రాజీవ్ కుమార్. వాతావరణం, భద్రత సహా ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనే ఊహగాహానాలు జోరందుకున్నాయి. ఎన్నికల సంఘం పర్యటనపై అధికారికంగా ప్రకటన రానప్పటికీ.. స్థానిక మీడియా మాత్రం ఈ నెల చివర్లో ఈసీ బృందం పర్యటించే అవకాశం ఉందని పేర్కొంది.
బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ సహా ఇతర పార్టీలన్ని ఎన్నికలకు సిద్ధమని చెబుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు బీజేపీ నేత దరక్షన్ అంద్రాబీ. ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలనే సిద్ధాంతాన్ని తాము నమ్ముతామని తెలిపారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రస్తుత పరిస్థితి అనుకూలమని.. కానీ అంతిమ నిర్ణయం ఎన్నికల సంఘానిదేనని గుర్తు చేశారు.
"జమ్ముకశ్మీర్లో ఎన్నికలు నిర్వహించే సమయం ఆసన్నమైంది. చాలా కాలంగా ఎన్నికల సంఘం పర్యటన కోసం జమ్ము కశ్మీర్ ప్రజలు వేచి చూస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికలు నిర్వహిస్తారనే నమ్మకం కలుగుతుంది. అందరితో చర్చించి త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇప్పటికే ఎన్నికలు చాలా ఆలస్యం అయ్యాయి. జమ్ము కశ్మీర్ ప్రజలు గత ఐదేళ్లుగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేకుండానే ఉన్నారు."
--అల్తాఫ్ బుఖారి, అప్నీ పార్టీ అధ్యక్షుడు
జమ్ముకశ్మీర్లో ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు నేషనల్ కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి ఇమ్రాన్ నబీ. అంతకుముందు ఎన్నికల సంఘాన్ని కలిసినప్పటి నుంచి ఇప్పటివరకు తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. జమ్ముకశ్మీర్లో రాజకీయ శూన్యత ఉందని చెప్పిన ఎన్నికల సంఘం.. దానిని పరిష్కరించాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల మాదిరిగానే జమ్ముకశ్మీర్లో ఎన్నికలు జరగాలని ఆకాంక్షించారు.