LIC Golden Jubilee Scholarship 2023 :లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్-2023 పేరుతో పేద విద్యార్థులకు ఉపకారవేతనాన్ని అందించనుంది. ప్రతిభ ఉండి కూడా, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న వారికి ఈ స్కాలర్‌షిప్ ఇవ్వనుంది. అర్హులైన విద్యార్థులు జనవరి 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు
LIC Scholarship Eligibility :
- జనరల్ స్కాలర్‌షిప్ : 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో 10+2 (ఇంటర్)/ డిప్లొమా క్వాలిఫై అయ్యుండాలి. అలాగే ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ విద్యా సంస్థల్లో ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, డిప్లొమా, వృత్తి విద్య లేదా తత్సమానమైన కోర్సులు చేస్తుండాలి. ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,50,000లోపు ఉండాలి.
- స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ : 10వ తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ఎల్ఐసీ ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్, ఒకేషనల్, డిప్లొమా, ఐటీఐ కోర్సు అభ్యసిస్తుండాలి. ప్రధానంగా అభ్యర్థిని తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,50,000 మించి ఉండకూడదు.
స్కాలర్‌షిప్
LIC Scholarship Amount :
- మెడిసిన్ విద్యార్థులకు జనరల్ స్కాలర్‌షిప్ కింద ఏటా రూ.40వేలు ఇస్తారు. దీనిని మూడు విడతలుగా (రూ.12000/ రూ.12000/ రూ.16000) అందిస్తారు.
- ఇంజినీరింగ్ విద్యార్థులకు జనరల్ స్కాలర్‌షిప్‌గా ఏడాదికి రూ.30వేలు ఇస్తారు. దీనిని మూడు విడతల్లో (రూ.9000/ రూ.9000/ రూ.12000) చెల్లిస్తారు.
- డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా, ఒకేషనల్ కోర్సులు చేసేవారికైతే, ఆ కోర్సు పూర్తయ్యేవరకు ఏటా రూ.20వేలు చొప్పున జనరల్ స్కాలర్‌షిప్ ఇస్తారు. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా (రూ.6000/ రూ.6000/ రూ.8000) విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
- స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్, ఒకేషనల్/ డిప్లొమా కోర్సులను పూర్తి చేసేందుకు ఈ మొత్తాన్ని మూడు దఫాలుగా (రూ.4500/ రూ.4500/ రూ.6000) చెల్లిస్తారు.
ఎంపిక విధానం
LIC Golden Jubilee Scholarship Selection Process :10వ తరగతి, ఇంటర్లో పొందిన మార్కుల మెరిట్ + విద్యార్థి/ విద్యార్థిని కుటుంబ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపిక చేస్తారు. అల్పాదాయ వర్గాలవారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.