Population Law: దేశంలో జనాభాను నియంత్రించేందుకు అవసరమైన చట్టాన్ని త్వరలోనే తీసుకొస్తామని కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో మంగళవారం జరిగిన గరీబ్ కల్యాణ్ సమ్మేళన్‌లో పాల్గొన్న ఆయన, ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇప్పటికే అనేక పెద్ద అంశాల్లో తమ ప్రభుత్వం బలమైన నిర్ణయాలను తీసుకుందని, జనాభా నియంత్రణపైనా త్వరలోనే తీసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఛత్తీస్‌గఢ్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యిందని మండిపడ్డారు. ''జల్ జీవన్ మిషన్ కింద జాతీయ సగటు లక్ష్య సాధన 50 శాతం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 23 శాతం మాత్రమే సాధించగలిగింది. రాష్ట్రంలో నీటి వనరుల సమస్య లేదు కానీ నిర్వహణ సమస్య ఉంది. వాటితో పాటు పీఎం ఆవాస్ పథకం లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేకపోయింది" అని ఆరోపించారు.