Landslides on Indrakiladri Temple :ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై చిన్నపాటి వర్షానికే కొండపై నుంచి ఆలయం సమీపంలోకి రాళ్లు జారిపడుతున్నాయి. చాలాసార్లు ఘాట్‌రోడ్డు మార్గంలో రాళ్లు జారిపడ్డాయి. రెండేళ్ల క్రితం దసరా ఉత్సవాలు జరుగుతుండగా.. వేలాది మంది భక్తులు కొండపై ఉన్న సమయంలో భారీ రాళ్లు జారిపడ్డాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. తరచూ వానలు పడినప్పుడు చిన్న చిన్న రాళ్లు పడుతూనే ఉన్నాయి. ఘాట్‌రోడ్డులో భక్తులు పైకి వచ్చే మారంలోనూ చాలాసార్లు కొండ చరియలు విరిగిపడ్డాయి.
Landslides at Vijayawada kanaka Durga Temple :రాళ్లు జారి పడకుండా అధికారులు తాత్కాలిక చర్యలే తీసుకుంటున్నారు. తప్ప శాశ్వత పరిష్కారం ఆలోచించడం లేదు. కొండపై అంతటా ఒకేరకమైన రాళ్లు లేవు. కొన్నిచోట్ల వదులుగా, మరికొన్నిచోట్ల గట్టిగా ఉన్నాయి. అన్నింటికీ కలిపి ఒకేరకమైన సాంకేతికత పనిచేయదు. రాయిని బట్టి కిందకు జారి పడకుండా ఉండేందుకు ఏం చేయాలనేది నిర్ణయించాలి. చాలాచోట్ల మట్టి మాదిరిగా వదులుగా ఉండే రాళ్లుంటాయి. ఇక్కడ కెనెటింగ్ చేయాల్సి ఉంటుంది.
ప్రమాదం పొంచి ఉందని తెలిసినా నిర్లక్ష్యం వీడరా..?
చిన్న రాళ్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో చైన్ లింక్ మెష్ వేసి..క్రాంక్‌లు బిగిస్తారు. ఇటీవల అందుబాటులోనికి వచ్చిన సాంకేతికతతో సెన్సార్లను ఏర్పాటు చేయొచ్చు. ఎక్కడైనా ప్రమాదం ఉందని తెలిస్తే వెంటనే అలారం మోగుతుంది. కొండపై ఎక్కడెక్కడ ఎలాంటి రాళ్లున్నాయి, వాటి పరిస్థితి ఏంటనేది నిపుణుల బృందం పలుమార్లు అధ్యయనం చేసింది. ఐఐటీ చెన్నై, ఐఐటీ కాన్పూర్ , బెంగళూరులోని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్, జీఎస్‌ఐకు చెందిన నిపుణుల బృందం గతేడాది ఇంద్రకీలాద్రికి వచ్చి పరిశీలించారు. వారి నివేదిక ఆధారంగా తాత్కాలిక ప్రాతిపదికగా చర్యలు చేపట్టారు. కానీ పరిస్థితిలో పూర్తిగా మార్పు లేదు.