తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రమంత్రి కుమారుడిపై హత్య, హత్యాయత్నం కేసు - అజయ్​ మిశ్రా

lakhimpur kheri ashish mishra: ఉత్తర్​ప్రదేశ్​, లఖింపుర్​ ఖేరీ హింసాత్మక ఘటనలో కేంద్ర మంత్రి అజయ్​ మిశ్ర తనయుడు ఆశిష్​ మిశ్రను ప్రధాన నిందితుడిగా పేర్కొంది సిట్​. హత్య, హత్యాయత్నం ఆరోపణల కింద అభియోగాలు మోపింది. ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నట్లు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్​లో సిట్​ వెల్లడించింది.

Lakhimpur violence
ఆశిష్‌ మిశ్ర

By

Published : Jan 4, 2022, 6:30 AM IST

Lakhimpur Kheri Ashish Mishra: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర తనయుడు ఆశిష్‌ మిశ్రను ప్రధాన నిందితుడిగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేర్కొంది. హత్య, హత్యాయత్నం ఆరోపణల కింద అభియోగాలను మోపింది. ఆయుధాల చట్టం నిబంధనల ఉల్లంఘనకూ పాల్పడినట్లు తెలిపింది. రైతులపైకి వాహనాన్ని దుమికించినప్పుడు సంఘటన స్థలంలో ఆశిష్‌మిశ్ర ఉన్నారని వెల్లడించింది. ఇదే కేసులో మరో 13 మందిని నిందితులుగా పేర్కొంటూ మొత్తం 5వేల పేజీలున్న ఛార్జిషీట్‌ను చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ చింతా రామ్‌కు అందజేసింది.

అభియోగాల్లో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర పేరును చేర్చలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టికునియా పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్‌ఐఆర్‌) ప్రకారం.. సిట్‌ ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేసింది. వీరిలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర తనయుడు ఆశిష్‌ మిశ్ర మోను, అంకిత్‌దాస్‌, నందన్‌ సింగ్‌ బిష్త్‌, సత్యం త్రిపాఠి అలియాస్‌ సత్యం, లతీఫ్‌ అలియాస్‌ కాలే, శేఖర్‌ భారతి, సుమిత్‌ జైశ్వాల్‌, ఆశిష్‌ పాండే, లవ్‌కుశ్‌రాణా, శిశుపాల్‌, ఉల్లాస్‌కుమార్‌ అలియాస్‌ మోహిత్‌ త్రివేది, రింకూ రాణా, ధర్మేంద్ర బంజార ఉన్నారు. మరో నిందితుడు వీరేంద్ర శుక్లా పేరును అభియోగపత్రంలో కొత్తగా చేర్చినట్లు సీనియర్‌ ప్రాసిక్యూషన్‌ అధికారి ఎస్‌.పి.యాదవ్‌ విలేకరులకు తెలిపారు. సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నించాడనే అభియోగంతో వీరేంద్ర పేరును జత చేసినట్లు తెలుస్తోంది. ఈ నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉందని సిట్‌ పేర్కొంది. వీరేంద్ర శుక్ల కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రకు బంధువని సమాచారం. కేసు తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదాపడింది.

అక్టోబరు 3న సాగు చట్టాల నిరసన ప్రదర్శకులపైకి వాహనాన్ని దూకించడం, తదనంతర ఘటనల్లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు, ఇద్దరు భాజపా కార్యకర్తలు సహా మొత్తం 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అభియోగపత్రంలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర పేరును కూడా చేర్చాలని తమ ఫిర్యాదులో కోరినట్లు రైతుల తరఫు న్యాయవాది తెలిపారు. అజయ్‌ మిశ్ర స్థానిక ఖేరీ లోక్‌సభ నియోజకవర్గ ప్రస్తుత ఎంపీ. తన కుమారుడు సంఘటన స్థలంలో ఉన్నట్లు ఒక్క ఆధారం చూపినా తన పదవికి రాజీనామా చేస్తానని అప్పట్లో అజయ్‌ మిశ్ర ప్రకటించారు. ఇప్పుడు సిట్‌ అభియోగపత్రంలో ఆశీష్‌ మిశ్ర సంఘటన స్థలంలోనే ఉన్నట్లుగా పేర్కొనడంతో కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్షాలు భాజపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి.

అజయ్‌ మిశ్రను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించండి: కాంగ్రెస్‌

సిట్‌ అభియోగపత్రం దాఖలు నేపథ్యంలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రను ఆ పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మిశ్రపై చర్యలు తీసుకోవడానికి ఇంకా ఏమి ఆధారాలు కావాలని ప్రధాని మోదీని రాహుల్‌ గాంధీ, ప్రియంకాగాంధీ వాద్రా ప్రశ్నించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details