Panna Diamond News: మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో ఓ కూలీకి అదృష్టం వరించింది. దుకాణం నుంచి ఇంటికి వస్తున్న నందిలాల్ రజక్ అనే కూలీకి డైమండ్ కనిపించింది. సాధారణ రంగు రాయి కావొచ్చేమో అని అనుకున్నాడు రజాక్. అయితే ఆ వజ్రాన్ని పన్నాలోని డైమండ్ ఆఫీసులో తనిఖీ చేయించాడు. అది ఒర్జినల్ డైమండ్ అని అధికారులు తెలిపారు. దీంతో సంతోషంతో తేలిపోయాడు రజాక్.
అసలేం జరిగిందంటే..
రాణిగంజ్‌కు చెందిన నందిలాల్ రజాక్ అనే వ్యక్తి బల్దేవ్ చౌక్‌లోని కిరాణ దుకాణంలో పనిచేస్తున్నాడు. దుకాణం నుంచి ఇంటికి వస్తుండగా అతడికి డైమండ్ కనిపించింది. అయితే అది రంగు రాయిగా భావించాడు. అది తీసుకుని తన అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ ఇరుగుపొరుగు వారికి చూపించగా.. అది నిజమైన వజ్రంలా ఉందని అతడితో అన్నారు. దీంతో తన స్నేహితులతో కలిసి వజ్రాన్ని తీసుకుని డైమండ్ కార్యాలయానికి వెళ్లాడు నందిలాల్. ఆ వజ్రాన్ని పరిశీలించిన అధికారులు.. 2.83 క్యారెట్లు ఉందని తేల్చారు. ఆ వజ్రం ఖరీదు సుమారు రూ.5లక్షలు ఉంటుందని చెప్పారు. దాన్ని వేలం వేసి వచ్చిన డబ్బులు రజాక్‌కు ఇవ్వనున్నారు అధికారులు.
"వజ్రం వేలం ద్వారా వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకుంటా. మిగిలిన డబ్బులతో ఏదైనా వ్యాపారం చేసుకుంటా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నా."
--నందిలాల్ రజాక్, కూలీ