KULGAM ENCOUNTER: జమ్ముకశ్మీర్లో నలుగురు ముష్కరుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో వీరిని హతమార్చాయి. మృతుల్లో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులు అని, లష్కరే తొయిబా సంస్థ కోసం పనిచేస్తున్నారని అధికారులు తేల్చారు.
పక్కా సమాచారంతో..:షౌకత్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాదిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కుప్వారా జిల్లా లోలబ్ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల శిబిరాలను చుట్టుముట్టారు. ముష్కరులు కాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు లష్కరే తొయిబా కోసం పనిచేస్తున్న పాకిస్థాన్ జాతీయులు అని ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు.
మరోవైపు.. కుల్గాం జిల్లా దమ్హల్ హంజీపొరా ప్రాంతంలోనూ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.