Whistle Removed From Lungs: బంగాల్ కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎమ్ అసుపత్రి ఓ కీలక శస్త్రచికిత్సకు వేదిక అయ్యింది. 12 ఏళ్ల బాలుడు పొరపాటున ప్లాస్టిక్ విజిల్‌ను మింగాడు. సుమారు 11 నెలలపాటు ఆ విజిల్ అతని ఊపిరితిత్తుల్లోనే ఉండిపోయింది. దీనిని రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్‌ఎస్‌కేఎమ్ ఆసుపత్రి సిబ్బంది సర్జరీ చేసిన తొలగించారు.
బంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరైపుర్ ప్రాంతానికి చెందిన రైహాన్ లష్కర్ ఈ ఏడాది జనవరిలో బంగాళాదుంప చిప్స్ తింటుండగా ప్రమాదవశాత్తు ప్లాస్టిక్ విజిల్ మింగినట్లు (whistle in lungs) ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత బాలుడు నోరు తెరవడానికి ప్రయత్నించినప్పుడల్లా విజిల్ శబ్దం వచ్చేదని అన్నారు. దీనిని అతని తల్లిదండ్రులు మొదట గుర్తించలేదని పేర్కొన్నారు. ఓ సారి స్థానికంగా ఉండే చెరువు దగ్గరకు వెళ్లినప్పుడు రైహాన్ ఎక్కువసేపు నీటిలో ఉండలేకపోవడాన్ని గమనించినట్లు చెప్పారు. తర్వాత అతనికి ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడగా.. ఆస్పత్రికి తీసుకొచ్చారని అక్కడి సిబ్బంది వివరించారు.
"మా కుమారుడు జరిగిన విషయాన్ని మాతో చెప్పలేదు. కేవలం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లు చెప్పాడు. దీనిపై మెడికల్ కాలేజ్ డాక్టర్లకు చూపించాం. వారు ఏం చేయలేకపోయారు. అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించడం గమనించాం. ఇన్‌ఫెక్షన్లు సోకినట్లు గుర్తించి.. బాబును ఎస్‌ఎస్‌కేఎమ్ ఆసుపత్రికి తీసుకుపోవాలని స్థానిక వైద్యుడు సూచించారు. బాలుడిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఒటోరినోలారిన్జాలజీ , హెడ్ అండ్ నెక్ సర్జరీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రొఫెసర్ అరుణాభా సేన్‌గుప్తా ఆధ్వర్యంలోని వైద్యులు గురువారం అతనికి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం బాబు బాగున్నాడు."
-రైహాన్ తండ్రి