Kisan Credit Card Yojana Benefits : తొలకరి మొదలైతే దుక్కి దున్నడం దగ్గర్నుంచి.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అంటూ.. పెట్టుబడి కోసం రైతు చేతిలో చాలా డబ్బు ఉండాలి. కానీ.. మెజారిటీ చిన్న, సన్నకారు రైతులున్న ఈ దేశంలో లిక్విడ్ క్యాష్ ఎలా ఉంటుంది? అందుకే.. వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెడతారు. భార్య నగలు తాకట్టు పెడతారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేస్తారు. వ్యవసాయం వైకుంఠపాళి ఆటగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో.. నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులను దాటితేగానీ.. పంట చేతికి రాదు. ఇందులో ఏ పాము నోట్లో చిక్కినా.. అన్నదాతలు సర్వం కోల్పోయినట్టే! చేసిన కష్టం బూడిదపాలైపోగా.. తెచ్చిన అప్పులు వడ్డీల రూపంలో కుప్పలుగా పెరిగిపోతుంటాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి రైతులకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రభుత్వాలు పలు పథకాలు ప్రవేశపెట్టాయి. అందులో ఒకటే కిసాన్ క్రెడిట్ కార్డు యోజన. అన్నదాతకు తక్కువ వడ్డీకే రుణం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. మరి, ఈ కార్డును ఎలా తీసుకోవాలి? దాన్నుంచి రుణం ఎలా పొందాలి? అర్హతలు ఏంటి..? దరఖాస్తు ఎలా చేయాలి? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల ప్రయోజనాలు ఏంటి..?
Uses of Kisan Credit Card : పీఎం కిసాన్ యోజన పథకం కింద.. కిసాన్ క్రెడిట్ కార్డ్ యోజన (KCC) పథకాన్ని కేంద్రం తీసుకువచ్చింది. దీన్ని 1998లో తొలిసారిగా ప్రారంభించారు. ఒకసారి కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకంటే.. దీని కాల పరిమితి ఐదు సంవత్సరాలు. ఈ ఐదేళ్ల కాలంలో రూ.3 లక్షల వరకు రుణం అందుతుంది. ఇందుకుగానూ వడ్డీ 4% లేదా అంతకన్నా తక్కువగా ఉంటుంది. ఈ రుణం ఇచ్చే ముందు.. రైతు ఆదాయం, అతని గత రుణ చరిత్ర, ఎంత వ్యవసాయ భూమి ఉంది? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంత రుణం ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. వాస్తవానికి వడ్డీ రేటు ఏడాదికి 7% ఉంటుంది. అయితే.. తీసుకున్న రుణాలు ఏడాదిలోపు చెల్లించే రైతులకు వడ్డీ రేటు 3% తగ్గిస్తారు. అందువల్ల.. కిసాన్ క్రెడిట్ కార్డు వార్షిక వడ్డీ రేటు 4% మించదన్నమాట.
ఏ బ్యాంకులు అందిస్తున్నాయి..?
KCC Offering Banks List : కిసాన్ క్రెడిట్ కార్డును దేశంలోని అన్ని ప్రముఖ బ్యాంకులూ అందిస్తాయి. ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేటు బ్యాంకులు కూడా ఈ సేవను అందిస్తున్నాయి. బ్యాంకుల వద్దకు వెళ్లడం ద్వారా.. లేదా ఆన్ లైన్లో స్వయంగా కూడా దరఖాస్తు చేసుకోవడం ద్వారా కిసాన్ కార్డును పొందే అవకాశం ఉంది. భూ యజమాని నుంకి కౌలు రైతుల వరకు ఎవ్వరైనా తీసుకోవచ్చు.