అన్నదాతల ఉద్యమంపై కుట్రలో భాగంగానే లఖింపుర్ ఖేరి ఘటన చోటుచేసుకుందని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. దేశ రైతు ఉద్యమ చరిత్రలో ఈ మారణకాండ బాధాకర అధ్యాయంగా మిగిలిపోతుందని పేర్కొంది. ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ రైతు సంఘాల నేతలు రాకేశ్ టికాయిత్, హన్నన్ మొల్లా, దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్, జోగేంద్ర సింగ్ ఉగ్రహాన్, హర్‌పాల్ సింగ్ బిలారి, సురేష్ కౌత్, అభిమన్యు కోహార్ తదితరులు దిల్లీలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అజయ్ మిశ్రను కేంద్ర సహాయమంత్రి పదవి నుంచి తొలగించాలని, అరెస్టు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. "లఖింపుర్ ఖేరి హింస ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్రలో భాగంగానే చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రకు నేరచరిత్ర ఉంది. ఆయన తొలుత రైతులను బెదిరించారు. తర్వాత ఆయన కుమారుడు ఆశిష్ తన సహచరులతో కలిసి రైతులను వాహనాలతో తొక్కించి చంపేశారు. ఈ మేరకు స్పష్టమైన ఆధారాలున్నా, భాజపా సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఈనెల 11వ తేదీలోగా మా డిమాండ్లను నెరవేర్చాలి. లేదంటే దేశ వ్యాప్తంగా ఈనెల 12 నుంచి 26 వరకూ పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతాం" అని వారు వెల్లడించారు.
అది చర్యకు ప్రతిచర్య మాత్రమే..
లఖింపుర్ ఘటనలో భాజపా కార్యకర్తలను చంపినవారిని దోషులుగా చూడొద్దని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. నిరసనకారులపైకి వాహనాలు దూసుకెళ్లడం వల్లే.. ఆందోళనకారులు స్పందించారని, ఇది చర్యకు ప్రతిచర్య మాత్రమేనని పేర్కొన్నారు.
రైతు ఉద్యమంలో 750 మంది మృతి
నూతన వ్యవసాయ చట్టాలకు(new farm laws) వ్యతిరేకంగా నెలల తరబడి జరుతున్న పోరాటంలో ఇప్పటివరకూ సుమారు 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. వీరి మృతి పట్ల ప్రధాని మోదీ పార్లమెంటులో కనీసం విచారమైనా వ్యక్తం చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కొనసాగుతుందని భాజపా సర్కారు చెబుతోందని, అది క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే తాము కోరుతున్నామన్నారు.