Suicides in Telangana Today : ఒకరిదేమో అనారోగ్య సమస్య.. మరొకరిదేమో కుటుంబ సమస్య.. ఇంకొకరిదేమో వేధింపుల సమస్య.. ఇవన్నీ చాలా మంది తమ నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలే అయినా.. వాటినే కొందరు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఈ సమస్యలు తమకు తప్ప ఎవరికీ లేవని ఫీలవుతున్నారు. తమ బాధలన్నింటికీ ఒక్క చావే పరిష్కారం అని భావిస్తున్నారు. క్షణికావేశంలో విలువైన తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తమతో పాటు తమను నమ్ముకున్న వారినీ ఈ లోకం నుంచి తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఇలాంటి ఘటనల్లో ఓ కుటుంబం సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు త్రుటిలో చావు నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే..
Family Suicide in Khammam District : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న మామిడితోటలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని కుమార్తె సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులు కృష్ణయ్య(40) ఆయన భార్య సుహాసిని (35), కుమార్తె అమృత (19)గా గుర్తించారు. సుహాసినికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Five Members Suicide Attempt in Nizamabad : నిజామాబాద్ నగరంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. తమ ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు అక్కా-చెల్లెలు సహా ఇద్దరు పిల్లలను రక్షించగా.. మరో బాలుడు గల్లంతయ్యాడు. నిజామాబాద్ నగర శివారులోని జానకంపేట్ వద్ద ఉన్న అశోక్ సాగర్ చెరువులో నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన అక్కా చెల్లెళ్లు నిఖిత, అక్షయలు తమ పిల్లలతో కలిసి చెరువులో దూకారు. నెహ్రూ నగర్‌కు చెందిన యువకులు గమనించి చెరువులో దూకిన వారిలో నలుగురిని కాపాడారు. మరో బాలుడి కోసం గాలింపు కొనసాగుతోంది. బాధితులంతా ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.