Kerala Man Obtains 145 Certificates: ఒక్క కోర్సు పూర్తిచేయడానికే నానా తంటాలు పడుతుంటారు కొందరు. అలాంటిది కేరళకు చెందిన షఫీ విక్రమాన్ ఏకంగా 145 సర్టిఫికెట్లను సాధించారు.
లాక్డౌన్ సమయంలో అందరూ చదువుకు దూరంగా ఉండి.. సినిమాలు, వినోద కార్యక్రమాలతో టైం అంతా గడిపితే.. తిరువనంతపురానికి షఫీ మాత్రం అందుకు భిన్నంగా అలోచించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 145 కోర్సులను పూర్తి చేశారు.
లాక్డౌన్ సమయంలో రోజుకు 20గంటలు కష్టపడి వర్చువల్‌గానే ఈ కోర్సులను పూర్తిచేశారు. ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల్లోని పలు యూనివర్సిటీల నుంచి ఈ సర్టిఫికెట్లను సాధించారు విక్రమాన్.
ఇదంతా జూన్, 2020లో మొదలైంది. ఆ సమయంలో మా బంధువొకరు ఓ వెబినార్‌లో పాల్గొనమని చెప్పారు. అందులో నేను పాల్గొన్నాను. ఆ తర్వాత వెబినార్‌లో పాల్గొన్నవారికి ఉచితంగా వివిధ కోర్సులు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీలు ఆహ్వానించాయి. అలా సర్టిఫికెట్లు సాధించాను. మనదేశంతో పోల్చితే అక్కడి విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఎంతో సహకరిస్తాయి. ఇన్ని కోర్సులు ఇక్కడ పూర్తిచేయలేము. ఒకటి లేదా రెండు మాత్రమే ఇక్కడు పూర్తిచేయగలుగుతాం.