Kerala lottery: కేరళలో లాటరీలు రూ.కోట్లు కురిపిస్తున్నాయి. టికెట్ కొన్నవారికి కళ్లుచెదిరే ప్రైజ్ మనీని కట్టబెడుతున్నాయి. వందలు పెడితే రూ.కోట్లు వచ్చిపడుతున్నాయి కాబట్టి సాధారణంగానే దీనిపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇటీవల ఈ ఆసక్తి ఇంకా ఎక్కువైంది. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. కేరళ ప్రభుత్వం విక్రయిస్తున్న ఈ లాటరీల గురించి అందరూ ఆరా తీస్తున్నారు. టికెట్లు ఎలా కొనలానే విషయంపై గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాటరీకి సంబంధించిన వివరాలు ప్రశ్నలు-సమాధానాల రూపంలో మీకోసం..
కేరళ ప్రభుత్వం విక్రయిస్తున్న లాటరీలు ఇతర రాష్ట్రాల ప్రజలు కొనుక్కోవచ్చా..?
ప్రస్తుతం అమలులో ఉన్న ఆ రాష్ట్ర 'లాటరీ రెగ్యులేషన్ చట్టం' ప్రకారం కేరళ వెలుపల లాటరీ టికెట్లు విక్రయించడం నిషిద్ధం. అయితే ఇతర రాష్ట్రాల ప్రజలు కేరళకు వచ్చి లాటరీలు కొనుక్కోవచ్చు. ప్రైజ్ మనీ గెలుచుకుంటే సంబంధిత డాక్యుమెంట్లు చూయించి డబ్బు కలెక్ట్ చేసుకోవచ్చు.
లాటరీ టికెట్లను ఆన్లైన్లో కొనుక్కోవచ్చా?
Kerala lottery online: లాటరీ రూల్స్ ప్రకారం.. ఆన్లైన్లో లాటరీలు కొనడం చట్టవిరుద్ధం. క్యాష్ ప్రైజ్‌ను గెలుచుకునేందుకు భౌతిక టికెట్ ఉండటం తప్పనిసరి. టికెట్లు విక్రయిస్తాం అంటూ కొన్ని వాట్సాప్ గ్రూపులు సైతం వెలిశాయి. వీరిలో ఎవరైనా నిజమైన టికెట్లు అమ్మేవారు ఉన్నా.. దీనికి చట్టబద్ధత అంటూ లేదు. ఈ వాట్సాప్ విక్రయాలు నమ్మకంపైనే ఆధారపడి ఉంటాయి. వీరు మోసం చేసినా.. బాధితులకు ప్రభుత్వం నుంచి రక్షణ ఉండదు. వాట్సాప్‌లో కొనుగోలు చేసినా.. వాటి ఒరిజినల్ టికెట్‌ను సమర్పిస్తేనే ప్రైజ్ మనీ ఇస్తారు.
ప్రైజ్ మనీ కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్లు?
- ఒరిజినల్ లాటరీ టికెట్
- ఫామ్ నెం.8పై స్టాంప్ వేసిన రసీదు
- పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు అతికించి, దానిపై గెజిటెడ్ అధికారి సంతకం చేసిన నోటరీ (రెండు కాపీలు)
- ఫొటోకాపీలు అతికించి ఉన్న టికెట్
- ప్రభుత్వ గుర్తింపు పత్రాలు (పాస్‌పోర్ట్/ రేషన్ కార్డు/ ఓటర్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/ పాన్ కార్డు)
- వీటితో పాటు ప్రైజ్ మనీ గెలిచిన వ్యక్తి నుంచి ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
కేరళ ప్రభుత్వం ఏఏ రకాల లాటరీలు విక్రయిస్తోంది?
Kerala lottery chart: వారంలో ప్రతిరోజూ లాటరీ డ్రాలు ఉంటాయి. సోమవారం- అక్షయ; మంగళవారం- కారుణ్య; బుధవారం- కారుణ్య ప్లస్; గురువారం- నిర్మల్; గురువారం- స్ట్రీశక్తి; శనివారం- విన్‌విన్; ఆదివారం- ఫిఫ్టీఫిఫ్టీ పేర్లతో డ్రాలు నిర్వహిస్తారు. ఫిఫ్టీఫిఫ్టీ లాటరీ గెలిచినవారికి రూ.కోటి ఇస్తారు. రోజూవారీ లాటరీలలో అధిక ప్రైజ్ ఉన్నది దీనికే.