తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Kerala Blast Bomb : 'యూట్యూబ్​ చూసి బాంబుల తయారీ.. సాక్ష్యం కోసం స్వయంగా వీడియోగ్రఫీ'.. కేరళ బ్లాస్ట్ కేసులో షాకింగ్ నిజాలు - కేరళలో బాంబు పేలుళ్లు

Kerala Blast Bomb : నిందితులు.. పోలీసులు చెర నుంచి ఎలా తప్పించుకుందాం? సాక్ష్యాధారాలను ఎలా తారుమారు చేద్దాం అని అలోచిస్తుంటారు. అయితే కేరళలో పేలుళ్లకు కారణమైన నిందితుడు మాత్రం సాక్ష్యాలను పోలీసులకు స్వయంగా అందజేశాడు. పేలుళ్లు ఎలా జరిపాడో పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించాడు. ఇలా ఎందుకు అనేదే ఇప్పుడు పోలీసుల మదిలోని ప్రశ్న.

kerala blast bomb
kerala blast bomb

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 2:04 PM IST

Updated : Oct 30, 2023, 2:31 PM IST

Kerala Blast Bomb : ఎక్కడైనా నిందితులు సాక్ష్యాలను తారుమారు చేయడానికి చూస్తారు. కుదిరితే ఉన్న ఆధారాలను పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడతారు. అయితే కేరళ.. కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ పేలుళ్లకు సంబంధించి కేసులో మాత్రం ఆసక్తికర పరిణామం జరిగింది. నిందితుడే పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్వయంగా అతడే సాక్ష్యాదారాలను పోలీసులకు అందించాడు. తాను చేసిన నేరాన్ని పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించాడు. మరి పోలీసులు.. నిందితుడు చెప్పిన మాటలను నమ్మారా? లేదా?

కేరళ.. కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్​లో జరిగిన భారీ వరుస పేలుళ్లకు సంబంధించి విస్తుపోయే నిజాలు పోలీసుల విచారణలో బయటపడ్డాయి. పేలుళ్లకు కారణమైన నిందితుడు డొమినిక్ మార్టిన్​ పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించి.. సాక్ష్యాలతో వచ్చి త్రిసూర్​లోని కొడకర పోలీస్ స్టేషన్​లో ఆదివారం లొంగిపోయాడు. అయితే నిందితుడు డొమినిక్ మార్టిన్ చెప్పిన విషయాలు నిజమా? కాదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులకు లొంగిపోవడానికి ముందు ఫేస్​బుక్​లో ఓ వీడియోను చిత్రీకరించినట్లు పోలీసులకు చెప్పాడు. అది నిజమేనని పోలీసుల విచారణలో తేలింది.

పోలీసుల విచారణలో తేలిన నిజాలు..
నిందితుడు డొమినిక్ మార్టిన్​ పేలుడు పదార్థాలను తయారు చేసేందుకు సామగ్రికి కొచ్చిలోని పలు ప్రాంతాల నుంచి కొనుగోలు చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. మందుగుండు, పెట్రోల్ కొనుగోలు చేసిన బిల్లులను సైతం పోలీసులకు అందించాడని వెల్లడించాయి. నిందితుడు డొమినిక్ మార్టిన్​.. తమ్మనంలోని తన అద్దె ఇంట్లోనే శనివారం పేలుడు పదార్థాలను తయారు చేశాడని.. ఆ విషయం అతడి భార్య, కుమార్తెకు తెలియదని పేర్కొన్నాయి. నిందితుడికి సైన్స్​పై ఆసక్తి ఉందని.. అందుకే పలు ప్రయోగాలు చేయడం వల్ల కుటుంబ సభ్యులకు సైతం అతడి నడవడికపై అనుమానం రాలేదని చెప్పాయి.

కన్వెన్షన్ సెంటర్​లో ఆదివారం ఉదయం రెండు కుర్చీల కింద పేలుడు పదార్థాలను నిందితుడు ఉంచాడని.. అతడు హాలు వెనుక నిలబడ్డాడని పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుడు మొబైల్ ఫోన్​లోని రిమోట్ కంట్రోల్​తో పేలుళ్లు జరిపాడని పేర్కొన్నాయి. పేలుళ్లను నిందితుడు తన ఫోన్​లో చిత్రీకరించాడని.. ఆ ఫుటేజీని పోలీసులకు అందజేశాడని వెల్లడించాయి. ఈ పేలుళ్లలో మరెవరికీ సంబంధం లేదని నిందితుడు పదేపదే చెబుతున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుడి మానసిక ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పేర్కొన్నాయి. నిందితుడు యూట్యూబ్ చూసి.. పేలుడు పదార్థాలను తయారు చేయడం నేర్చుకున్నాడని వెల్లడించాయి.

3కు చేరిన మృతుల సంఖ్య..
మరోవైపు.. కేరళలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్​లో ఆదివారం జరిగిన పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య 3కు చేరింది. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 12 ఏళ్ల బాలిక సోమవారం ఆర్ధరాత్రి మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్​ వెల్లడించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మరో 60 మంది నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
కాగా.. మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ మలయత్తూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అఖిలపక్ష సమావేశం..
వరుస పేలుళ్ల నేపథ్యంలో కేరళ సర్కార్ అప్రమత్తం అయ్యింది. ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి పినరయి విజయన్​. సోమవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ హాల్​లో ఈ సమావేశం జరిగింది.

ఇదీ జరిగింది..
కేరళలోని కోచి సమీపంలో ఉండే కలమస్సేరిలోని క్రిస్టియన్ సంఘానికి చెందిన జమరా ఇంటర్‌ నేషనల్‌ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ఉదయం వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా.. సుమారు 60 మంది గాయపడ్డారు. కన్వెన్షన్‌ సెంటర్‌లో క్రైస్తవులు ఆదివారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో మొదటి పేలుడు సంభవించిందని.. ఆ తర్వాత మరో రెండు పేలుళ్లు జరిగాయని ఆ సమయంలో లోపలే ఉన్న వృద్ధురాలు తెలిపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Oct 30, 2023, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details