తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిరకాల స్వప్నానికి తెర- 'కశ్మీర్'​కు పండిత్​లు!

సొంతూరికి తిరిగి చేరాలన్న కశ్మీరీ పండిత్​ల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరేలా కనపడుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వ్యాఖ్యలు వీరి జీవితాల్లో ఆశలు నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీరీ పండిత్​ల కథ, మోదీ ప్రభుత్వం చర్యలపై ప్రత్యేక కథనం..

Kashmiri Pandits to return to ancestral land
చిరకాల స్వప్నానికి తెర- 'కశ్మీర్'​కు పండిత్​లు!

By

Published : Feb 16, 2021, 2:11 PM IST

Updated : Feb 16, 2021, 2:28 PM IST

సొంత ఊరితో మనిషికి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. జీవితంలో ఎంత తీరిక లేకుండా ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా.. ఎప్పుడెప్పుడు సొంత ఊరుకు వెళదామా అని అనుకుంటాము. కానీ సొంత ఊరు నుంచి వలస వస్తే? ఎన్నో ఏళ్లుగా తిరిగి వెళ్లే అవకాశమే లేకపోతే? ఊరి పేరు వింటేనే భయంతో వణికిపోతే? ఇదే 'కశ్మీరీ పండిత్​'ల కథ. వీరి వ్యథ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారే అవకాశాలు కనపడుతున్నాయి. పండిత్​ల చిరకాల స్వప్నం నెరవేరేలా ఉంది. పార్లమెంట్​ వేదికగా.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. మరి షా ఏమన్నారు? అసలు కశ్మీరీ పండిత్​ల కథ ఏంటి?

అలజడుల లోయ..

కశ్మీర్​ సమస్యలాగే.. కశ్మీరీ పండిత్​ల కథ కూడా ఎన్నో దశాబ్దాల నుంచి వార్తల్లో ఉంది. 1984లో.. జమ్ముకశ్మీర్​లో ఫరూక్​ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు ఆయన బావ గులామ్​ మహమ్మద్​ షా. ఆయన పాలనలో కశ్మీర్​ లోయలో ఇస్లాం విపరీతంగా పెరిగింది.

1986లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఆ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ కశ్మీర్​ అనంతనాగ్​లో పండిత్​లకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. పండిత్​లపై దాడి, మహిళలపై అత్యాచారం, ఇళ్లను తగలపెట్టడం, ఆలయాలను ధ్వంసం చేయడం... ఇలా ఎన్నో అరాచకాలు జరిగాయి.

ఇదీ చూడండి:-జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం

కొన్నాళ్లకు.. 1987లో జమ్ముకశ్మీర్​లో ఎన్నికలు జరిగాయి. అయితే కాంగ్రెస్​- ఫరూక్​ అబ్దుల్లా కలిసి రిగ్గింగ్​కు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తర్వాత క్రమంగా లోయలో వేర్పాటువాదులు పెరిగిపోయారు.

ఫరూక్​ అబ్దుల్లా ప్రభుత్వం- వేర్పాటువాదుల మధ్య మతపరమైన విభేదాలు తారస్థాయికి చేరాయి. తమ లక్ష్యాన్ని సాధించేందుకు భారత వ్యతిరేక సంస్థలతో చేతులు కలిపారు వేర్పాటువాదులు. ఈ సమయంలో మతపరమైన విద్వేషాలు వేగంగా వ్యాపించాయి. కశ్మీరీ పండిత్​లు బిక్కుబిక్కుమంటూ బతకడం మొదలుపెట్టారు.

1988 జులైలో రెండు బాంబు దాడులు శ్రీనగర్​ను కుదిపేశాయి. అనంతరం 1989 సెప్టెంబర్​లో.. అప్పటివరకు కశ్మీరీ పండిత్​ల హక్కు కోసం ఉద్యమించిన తికా లాల్​ తప్లూను కొందరు దుండగులు ఆయన ఇంటి బయటే కాల్చిచంపేశారు.

ఈ పరిణామాల మధ్య ఫరూక్​ అబ్దుల్లా 1990లో సీఎం పదవికి రాజీనామా చేశారు. లోయలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. హిందూ వ్యతిరేక ఉద్యమం భగ్గుమంది. ఇవి కశ్మీరీ పండిత్​ల వలసకు పునాదులుగా మారాయి.

1990 జనవరిలో పరిస్థితులు చేయి దాటిపోయాయి. వందలాది మంది పండిత్​లు హింసకు గురయ్యారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగేవి. ఆ ఏడాది చివరి నాటికి 3.5లక్షల మంది పండిత్​లు వలస వెళ్లిపోయారు. కొందరు మాత్రం తమ ఇంటిని, పుట్టిపెరిగిన ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లలేక అక్కడే ఉండిపోయారు.

ఇదీ చూడండి:-చైనా కనుసన్నల్లో పాక్‌- 'కశ్మీర్‌' పేరిట హింసోన్మాదం

ఆగని ఆకృత్యాలు..

లోయలో అలజడులు అక్కడితో ఆగలేదు. 1997 మార్చిలో సంగ్రామ్​పొర గ్రామంలోని ఓ కశ్మీరీ కుటుంబంపై మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. ఏడుగురిని ఇంటిలో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి కాల్చిచంపారు. 1998 జనవరిలో వంధమా గ్రామంలో 23మంది కశ్మీరీ పండిత్​లపై కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. 2003 మార్చిలో.. నందిమార్గ్​ గ్రామంలో 24 పండిత్​లను అతి కిరాతకంగా కాల్చేశారు. ఇందులో పసికందులూ ఉండటం అత్యంత విషాదకరం.

ఛిన్నాభిన్నం..

1941 జనాభా లెక్కల ప్రకారం.. కశ్మీర్​ లోయలో బ్రాహ్మణులు వంటి హిందూ మైనారిటీలు రాష్ట్రంలో 15శాతం వరకు ఉండేవారు. 1981లో అది 4శాతానికి పడిపోయిందని "అవర్​ మూన్​ హ్యాస్​ బ్లడ్​ క్లాట్స్​" అనే పుస్తకంలో రచయిత రాహుల్​ పండితా పేర్కొన్నారు. కశ్మీర్​ నుంచి వలస వచ్చిన వారిలో ఆయన కుటుంబం ఒకటి.

1989-2004 మధ్య కాలంలో మరణించిన 1,400మంది హిందువుల్లో 219మంది పండిత్​లని ప్రభుత్వం నివేదించింది. పండిత్​లకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ బృందం 'పానున్​'.. ఈ నివేదికను వ్యతిరేకించింది. ఈ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందని ఆరోపించింది. 1990 నుంచి మృతిచెందిన 1,341మంది పండిత్​లతో ఓ జాబితాను విడుదల చేసింది.

1990 నుంచి.. లోయలోని 95శాతం కశ్మీరీ పండిత్​ల కుటుంబాలు వలస వెళ్లిపోయారని రాజకీయ నిపుణుడు అలెగ్జాండర్​ ఎవాన్స్​ పేర్కొన్నారు. అది 1,50,000-1,60,000మంది ప్రజలతో సమానం అన్నారు.

ఇదీ చూడండి:-కశ్మీర్ మ్యాప్​పై వికీపీడియాకు కేంద్రం నోటీసులు

ప్రభుత్వ లెక్కలు..

వలస వెళ్లిన కుటుంబాలపై భారత ప్రభుత్వం ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో.. లోయ నుంచి జమ్ముకశ్మీర్​తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారిపై నమోదైన వివరాలను వెల్లడించింది.

రాష్ట్రం/ యూటీ వలస వెళ్లిన కుటుంబాలు
జమ్ము 43,618
దిల్లీ/ ఎన్​సీఆర్​ 19,338
ఇతర రాష్ట్రాలు/ యూటీ 1995
మొత్తం 64,951

మోదీ రాకతో..

2008 ఏప్రిల్​లో.. పండిత్​ల పునరావాసం కోసం రూ. 1,618కోట్ల ప్యాకేజీని ప్రకటించింది నాటి ప్రధాన మంత్రి మన్మోహన్​ సింగ్​ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం.

2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన అరుణ్​ జైట్లీ.. కేంద్ర బడ్జెట్​లో కశ్మీరీ పండిత్​ల పునరావాసం కోసం రూ. 500కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. కశ్మీరీ పండిత్​ల కోసం 6 వేల ఇళ్లు నిర్మించనున్నట్టు 2017లో.. కేంద్రమంత్రి రాజ్​నాథ్​ ప్రకటించారు. అయితే ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు.

కశ్మీరీ పండిత్​లను తిరిగి లోయకు చేర్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇదే విషయాన్ని 2014, 2019 లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించింది.

2019లో ఆర్టికల్​ 370ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వం. దీనిని కశ్మీరీ పండిత్​లు స్వాగతించారు.

ఈ తరుణంలో ఈ నెలలో జరిగిన బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా జమ్ముకశ్మీర్​కు రాష్ట్ర హోదాపై ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. కశ్మీరీ పండిత్​ల అంశాన్నీ ప్రస్తావించారు. వలసవెళ్లిన పండిత్​లు అందరినీ 2022 నాటికి లోయలోకి తిరిగి చేర్చాలని ప్రభుత్వం సంకల్పించుకున్నట్టు ప్రకటించారు.

ఇదీ చూడండి:-'కశ్మీర్ చరిత్రలో మోదీ పాలన శాంతియుతమైనది'

Last Updated : Feb 16, 2021, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details