తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం సేవించి స్కూల్​కు టీచర్​.. విద్యార్థులను తిడుతూ, కొడుతూ.. చివరకు - మహిళా టీచర్ సస్పెండ్

మద్యం సేవించి పాఠాలు బోధిస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని అధికారులు సస్పెండ్ చేశారు. నిత్యం మద్యం సేవించి ఉపాధ్యాయురాలు పాఠశాలకు వస్తుండేవారు. కారణం లేకుండానే విద్యార్థులను కొట్టడం, తిట్టడం, ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగుతుండేవారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Karnataka Lady teacher
మద్యం సేవించి పాఠశాలకు.. ఉపాధ్యాయురాలు సస్పెన్షన్‌

By

Published : Sep 9, 2022, 8:35 AM IST

Updated : Sep 9, 2022, 9:03 AM IST

మద్యం సేవించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలిని కర్ణాటక విద్యాశాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ ఘటన తుమకూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకొంది. ఉపాధ్యాయురాలు ఉదయాన్నే మద్యం సేవించి పాఠాలు బోధిస్తున్న ఘటనలో అధికారుల పరిశీలనలో దొరికిపోయారు.
చిక్కసారంగి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు గంగలక్ష్మమ్మ మద్యం సేవించి పాఠాలు బోధిస్తుండేవారు. ఈమె పాతికేళ్లుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. అయిదేళ్లుగా మద్యానికి బానిస అయ్యారు. నిత్యం మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను కారణం లేకుండానే కొట్టడం, తిట్టడం, సహ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. విసిగిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయురాలు గంగలక్ష్మమ్మకు ఎన్నిసార్లు తప్పును సరిదిద్దుకోవాలని హెచ్చరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చివరికి తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేసి ఉపాధ్యాయురాలికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు.

ఉపాధ్యాయురాలు గంగలక్ష్మమ్మ

ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన తాలూకా విద్యాధికారి(బీఇవో) హనుమానాయక్‌ పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయురాలు టేబుల్‌డ్రాను పరిశీలించడానికి ప్రయత్నించగా ఆమె అడ్డుకున్నారు. గ్రామస్థులు టేబుల్‌ డ్రాకు తాళాలు విరగగొట్టి చూడగా అందులో ఓ మద్యం సీసా, మరో రెండు ఖాళీ సీసాలు లభించాయి. ఈ పరిణామంతో గంగలక్ష్మమ్మ తీవ్ర ఆగ్రహంతో తన గదిలోకి వెళ్లి తాళాలు వేసుకుని ఆత్మహత్య చేసుకొంటానని హంగామా సృష్టించారు. అనంతరం పోలీసులు అక్కడికి వచ్చి మద్యం సీసాలను జప్తు చేశారు. ఉపాధ్యాయురాలు గంగలక్ష్మమ్మను సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించారు.

Last Updated : Sep 9, 2022, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details