Karnataka JDS President Expelled :ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడంపై జేడీఎస్ అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగురవేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంపై వేటు పడింది. ఇబ్రహీంను జేడీఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ గురువారం ప్రకటించారు. అలాగే రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. సీఎం ఇబ్రహీం స్థానంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తాత్కాలికంగా నియమించారు దేవెగౌడ.
పార్టీని బలోపేతం చేయడానికి జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేశారని తెలిపారు కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి. తన నాయకత్వంలో తాత్కాలిక కమిటీని ప్రకటించారని అన్నారు. 'పార్టీని బలోపేతం చేయడం నా బాధ్యత. అలాగే పార్టీని అభివృద్ధి చేయడంపై నేను ఏకాగ్రతగా ఉన్నాను' అని తెలిపారు.
ఇటీవలే ఎన్డీఏలో జేడీఎస్ చేరడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సీఎం ఇబ్రహీం. ఎన్డీఏలో జేడీఎస్ చేరికపై పార్టీ అధినేత దేవెగౌడ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారు. పార్టీలో చీలిక ఏర్పడ్డట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు. తమదే అసలైన 'సెక్యులర్' వర్గమని ప్రకటించుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని ఆ పార్టీ అధినేత దేవెగౌడకు విజ్ఞప్తి చేశారు.