Karnataka IT Raid CBDT :కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.94 కోట్ల నగదును ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లపై చేసిన దాడుల్లో రూ.8 కోట్ల విలువైన ఆభరణాలు, 30 లగ్జరీ వాచీలను సీజ్ చేసినట్లు తెలిపింది. అక్టోబర్ 12న రైడ్లు చేపట్టినట్లు సీబీడీటీ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. బెంగళూరు ఐటీ విభాగంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దిల్లీలోని బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు వెల్లడించింది. మొత్తం 55 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు స్పష్టం చేసింది.
"ఈ తనిఖీల ఫలితంగా లెక్కల్లోకి రాని రూ.94 కోట్ల నగదు వెలుగు చూసింది. బంగారు, వజ్రాభరణాలు భారీగా బయటపడ్డాయి. ఆభరణాల విలువ రూ.8 కోట్లుగా తేలింది. మొత్తంగా రూ.102 కోట్ల ఆస్తులు సీజ్ చేశాం. దీంతోపాటు, విదేశాల్లో తయారైన 30 లగ్జరీ వాచీలను.. గడియారాల వ్యాపారంతో సంబంధం లేని ఓ ప్రైవేటు ఉద్యోగి వద్ద నుంచి సీజ్ చేశాం."
-కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటన
IT Raids In Bengaluru :ఈ సోదాల్లో డిజిటల్ డేటా, హార్డ్ కాపీల రూపంలో ఉన్న సాక్ష్యాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు సీడీబీటీ తెలిపింది. ఖర్చులను ఎక్కువగా చూపించి తమ ఆదాయాన్ని తక్కువగా చూపించేందుకు ఈ కాంట్రాక్టర్లు ప్రయత్నించినట్లు తెలుస్తోందని సీడీబీటీ పేర్కొంది. సబ్ కాంట్రాక్టర్ల ద్వారా నకిలీ కొనుగోళ్లు, తప్పుడు ఖర్చులు చూపించారని వెల్లడించింది. ఈ అవకతవకల వల్ల లెక్కల్లోకి రాని నగదు భారీగా పోగైందని తెలిపింది.