Karnataka election results 2023 : కర్ణాటకలో ఎవరు అధికారంలోకి రానున్నారనే విషయం కొద్ది గంటల్లో తేలిపోనుండగా.. అన్ని పార్టీలు తమదైన వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఫలితం తమకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి? ప్రతికూలంగా వస్తే ఏం చేయాలో ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. మెజారిటీ తమకే వస్తుందని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. కింగ్ మేకర్ కాదు కింగ్ అవ్వాలని జేడీఎస్ ఊవిళ్లూరుతోంది. ఇక బీజేపీ ప్లాన్స్ ఎప్పటిలాగే అంచనాలకు అందకుండా సాగుతున్నట్లు తెలుస్తోంది. మెజారిటీ స్థానాలు రాకపోతే రాష్ట్రంలో తమ 'ఆపరేషన్' ప్రారంభిస్తామని బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి ఆర్ అశోక సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ మార్గదర్శకత్వంలో 'కార్యాచరణ' చేపడతామని చెప్పారు. బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చినా, రాకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో హంగ్ వస్తే బీజేపీ ఏం చేస్తుందనే విషయంపై మీడియాతో మాట్లాడారు అశోక.
"మేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఎప్పుడు, ఎలా అని అడగకండి. కేంద్ర అధినాయకత్వంతో చర్చిస్తాం. ప్లాన్-బీపై రాష్ట్ర నాయకులతో మాట్లాడతాం. ఈ ఏడాది 'కప్పు' మాదే. హైకమాండ్ మద్దతుతో ట్రోఫీ గెలిచి విజేతలుగా అవతరిస్తాం. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చి తీరుతుంది. అందులో అనుమానం లేదు. మేం మెజారిటీతో గెలుస్తున్నాం. మెజారిటీ రాకపోతే హైకమాండ్ మార్గదర్శకత్వంలో 'ఆపరేషన్' ప్రారంభిస్తాం."
-ఆర్ అశోక, బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి
కర్ణాటకలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని పేర్కొనగా.. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఇంకొన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. రెండు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ప్లాన్-బీ గురించి తనకు అవగాహన లేదని కర్ణాటక సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై చెప్పారు. మెజారిటీ సాధించే అధికారంలోకి వస్తామని చెప్పారు. ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు అని రుజువవుతుందని అన్నారు.
"నేను ఆయన(అశోక)తో మాట్లాడలేదు. ప్లాన్-బీ ఏంటో తెలియదు. హంగ్ అసెంబ్లీ ఉండదని నేను విశ్వసిస్తున్నా. ఏడాది పాటు అధికారంలో ఉన్న కూటమి పూర్తిగా వైఫల్యం చెందింది. 141 స్థానాలు వస్తాయని చెప్తున్న డీకే శివకుమార్‌ను శుక్రవారం వరకు కలలు కననివ్వండి. కుమారస్వామి తాము కింగ్ మేకర్ కాదు.. కింగ్ అని చెప్పుకుంటున్నారు. ఎవరైనా ఏదైనా చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. 2018 మాదిరిగానే ఈసారి ఎగ్జిట్ పోల్ అంచనాలు అసత్యమని తేలుతుంది."
-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక సీఎం