'చక్రం' ఆవిష్కరణ తర్వాత మానవ జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. జనసమూహం అందుకు తగినట్లుగానే తమ జీవితాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మోటారు వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా పర్యావరణం దెబ్బతినడం ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రకృతిపై మమకారం పెంచుకున్న ఓ అధ్యాపకుడు.. పర్యావరణ హితం కోసం తనవంతుగా కృషి చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే మోటారు వాహనాల జోలికి పోకుండా.. 20 ఏళ్లుగా సైకిల్‌నే వాడుతున్నారు. ఆయనొక్కరే కాదండోయ్? కుటుంబం మొత్తం సైకిల్‌నే వినియోగిస్తోంది.
కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని తరళబాలు నగరానికి చెందిన డాక్టర్ హెచ్.కె.ఎస్ స్వామి. సైకిల్ వినియోగాన్ని మరింత పెంచి.. 'ఇంధన రహిత భారత్' గురించి ఎన్నో కలలు కంటున్నారు స్వామి.
ఇద్దరు కూతుర్లకూ భాగస్వామ్యం
ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్న స్వామి.. తన వృత్తికి వీడ్కోలు పలికి ప్రకృతిపై అవగాహన కల్పించడంలో నిమగ్నమయ్యారు. ఆయన ఇద్దరు కుమార్తెలు.. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. వారు ఎక్కడికెళ్లినా సైకిల్‌నే ఉపయోగిస్తారు. తమ స్నేహితులకు, ఇతరులకు పర్యావరణం గొప్పతనాన్ని గురించి తెలిపేందుకు ఇలా సైకిల్‌పై తిరుగుతూ.. ఆ అమ్మాయిలు తమవంతు కృషి చేస్తున్నారు.