ప్రస్తుత కాలంలోనూ కులం కట్టుబాట్లు తప్పట్లేదు. గ్రామ పెద్దలు.. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి ఊరి నుంచి వెలివేయడం ఇంకా కొనసాగుతోంది. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలోని చామరాజనగర్లో జరిగింది. ఇద్దరు ప్రేమికులు కులాంతర వివాహం చేసుకున్నారని తెలిసిన తర్వాత గ్రామ పెద్దలు వారిని ఊరి నుంచి వెలివేశారు. అక్కడితో ఆగకుండా రూ.6 లక్షలు జరిమానా కూడా వేశారు. అసలేం జరిగిందంటే..
కూనగల్లి గ్రామానికి చెందిన గోవిందరాజు అనే యువకుడు శ్వేత అనే దళిత యువతిని ప్రేమించాడు. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గోవిందరాజు ఉప్పరశెట్టి కులానికి చెందిన వ్యక్తి కాగా.. శ్వేత దళిత యువతి. ప్రేమికులిద్దరూ వారి తల్లిదండ్రులను ఒప్పించి 5 సంవత్సరాల క్రితం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. గోవిందరాజు తన భార్యతో కలిసి మాలవల్లి గ్రామంలో నివసిస్తున్నాడు. అప్పుడప్పుడు తన తల్లిదండ్రులను చూడడానికి భార్య శ్వేతతో కలిసి కూనగల్లి గ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలో గోవిందరాజు దంపతులు కొద్ది రోజుల క్రితం కూనగల్లి గ్రామానికి వచ్చారు. శ్వేత పక్కింటి వారితో తాను ఎస్సీ కులానికి చెందిన యువతినని చెప్పింది. ఈ విషయం గ్రామపెద్దల వరకు వెళ్లింది. ఫిబ్రవరి 23న కూనగల్లి గ్రామపెద్దలు పంచాయతీ నిర్వహించారు. గోవిందరాజు.. గ్రామ కట్లుబాట్లు ధిక్కరించి వేరే కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడని రూ.3 లక్షల జరిమానా విధించారు. మార్చి 1లోగా జరిమానా కట్టేయాలని గడువు విధించారు.