Karnataka Contractor Euthanasia : కర్ణాటక హుబ్లీకి చెందిన ఓ కాంట్రాక్టర్.. కారుణ్య మరణానికి అనుమతి కోరాడు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు లేఖ రాశాడు. ఇక్కడి అధికారులు అడిగినంత కమీషన్లు ఇచ్చుకోలేకపోతున్నానని, తనకు మరణమే శరణ్యమని లేఖలో పేర్కొన్నాడు. తనకు రావాల్సిన బిల్లులను క్లియర్ చేసేందుకు అధికారులు ఏకంగా 40 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు.
చిక్కమగళూరు జిల్లాలోని కడూరు, మూడిగెరె గ్రామ పంచాయతీలకు కొవిడ్-19 సంబంధిత పరికరాలను సరఫరా చేశానని కాంట్రాక్టర్ బసవరాజ్ మోదీతో పాటు ఇతర ప్రముఖులకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఇందుకు తనకు చెల్లింపులు జరపకుండా అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని చెప్పాడు. దాదాపు రూ.1.12 కోట్ల బిల్లులను పాస్ చేయడానికి 40 శాతానికంటే ఎక్కువ కమీషన్ ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని తెలిపాడు.
పరికరాలు సరఫరా చేసి రెండేళ్లు కావొస్తున్నా బిల్లులు పాస్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు బసవరాజ్. గతంలో తన ఫిర్యాదు మేరకు బిల్లులు పాస్ చేయాలని పీఎంఓ, సీఎంఓ అధికారులు పలుమార్లు పంచాయతీ అధికారికి సూచించినా ఫలితం లేదని వాపోయాడు. అందుకే గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.
కొన్ని నెలల క్రితం ఇలాంటి ఘటనే కర్ణాటకలో కలకలం రేపింది. మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై ఆరోపణలు చేసిన ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.