తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంత్రులకు శాఖల కేటాయింపు.. సిద్ధరామయ్య వద్దే ఆర్థికం.. డీకేకు ఏం ఇచ్చారంటే?

Karnataka Cabinet Ministers : కర్ణాటకలో కొలువుదీరిన సిద్ధరామయ్య సర్కార్​.. మంత్రులకు శాఖలను కేటాయించింది. కీలకమైన ఆర్థిక శాఖను.. సిద్ధరామయ్య తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​కు నీటిపారుదల శాఖ, బెంగళూరు నగర అభివృద్ధి శాఖను కేటాయించారు. ఇంకా ఎవరెవరికి ఏయే శాఖలు దక్కాయంటే?

Karnataka Cabinet Ministers
Karnataka Cabinet Ministers

By

Published : May 29, 2023, 1:01 PM IST

Karnataka Cabinet Ministers : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులకు శాఖలను కేటాయించింది. ఊహాగానాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఇక పార్టీ ప్రయోజనాల కోసం సీఎం పదవిని త్యాగం చేసి.. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన డీకే శివకుమార్‌కు నీటిపారుదలతో పాటు, బెంగళూరు నగర అభివృద్ధి శాఖలను అప్పగించారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖల కేటాయింపులపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించి ఇప్పటివరకు 13 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంతో ఈసారి కూడా ఆర్థికశాఖను తన వద్దే ఉంచుకున్నారు. అలాగే కేబినెట్‌ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్‌, సమాచార, ఐటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రిఫామ్స్‌ వంటి శాఖలను తానే తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖ, బెంగళూరు నగర అభివృద్ధి శాఖలను కేటాయించారు. త్వరలో జరగబోయే బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డీకేకే ఆ శాఖను అప్పగించినట్లు సమాచారం.

ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్
ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్

ఖర్గే కుమారుడికి గ్రామీణాభివృద్ధి..
గతంలో హోం శాఖను నిర్వర్తించిన మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వరకు ఈసారీ అదే శాఖ దక్కింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖలను కేటాయించారు. కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖ, వృద్ధులు, దివ్యాంగుల సాధికారిత శాఖలను అప్పగించారు. మాజీ సీఎం బంగారప్ప కుమారుడు మధు బంగారప్పకు ప్రాథమిక, ఉన్నత విద్యా శాఖను కేటాయించారు.

కాంగ్రెస్ నాయకుడు రామలింగా రెడ్డికి రవాణాశాఖను కేటాయించారు. ఈ శాఖపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయగా.. కేపీసీసీ చీఫ్​ డీకే శివకుమార్‌ ఆదివారం రామలింగా రెడ్డి నివాసానికి వెళ్లి బుజ్జగించారు. దీంతో ఆ శాఖను తీసుకునేందుకు రామలింగారెడ్డి అంగీకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక.. దినేశ్‌ గుండురావుకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం.. కృష్ణ బైరెగౌడకు రెవెన్యూ, సతీశ్ జర్ఖిహోళికి ప్రజా వ్యవహారాలు, హెచ్‌సీ మహదేవప్పకు సామాజిక సంక్షేమ శాఖలను అప్పగించారు.

మంత్రుల ప్రమాణ స్వీకారం(పాత ఫొటో)

మే 20వ తేదీన సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మే 27న మరో 24 మందితో కేబినెట్‌ను విస్తరించారు. దీంతో మొత్తం 34 మందితో పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి దాటాక.. శాఖల కేటాయింపులపై అధికారిక ప్రకటన చేశారు.

Karnataka Election Results : ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలు అసెంబ్లీ స్థానాలకుగాను మే 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీ 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్‌ 19 స్థానాలు గెలుపొందాయి.

ABOUT THE AUTHOR

...view details