Karnataka Budget 2023 : కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎన్నికల హామీల అమలుకు ఖజానాపై భారీ స్థాయిలో భారం పడనున్న పరిస్థితుల్లో.. ఆదాయం పెంచుకునే దిశగా ఈ బడ్జెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ప్రధానంగా ఆదాయ పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
మందుబాబులకు షాక్
Liquor Price Hike In Karnataka : బడ్జెట్‌లో భాగంగా ఇండియన్ మేడ్ లిక్కర్‌పై ఎక్సైజ్ డ్యూటీని కర్ణాటక ప్రభుత్వం 20 శాతం పెంచింది. బీర్ల అమ్మకాలపై ఎక్సైజ్ సుంకాన్ని 10 శాతం పెంచింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 18 స్లాబ్‌ల్లో అదనంగా 20 శాతం ఎక్సైజ్ డ్యూటీ పెరగనుంది. ఈ పెంపు తరువాత కూడా కర్ణాటకలో లిక్కర్ ధరలు పొరుగు రాష్ట్రాల కన్నా తక్కువగానే ఉంటాయని సిద్ధరామయ్య తెలిపారు.
అత్యధికంగా విద్యారంగానికే..
కర్ణాటక బడ్జెట్ మొత్తం వ్యయం 3,27,747 కోట్ల రూపాయలుగా సిద్ధరామయ్య ప్రభుత్వం అంచనా వేసింది. అత్యధికంగా విద్యారంగానికి రూ.37,587 కోట్లను కేటాయించింది. మహిళా- శిశు సంక్షేమానికి రెండో ప్రాధాన్యం ఇచ్చింది. దీనికి రూ.24,166 కోట్లను ఈ వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి 14,950 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
ఐదు ఉచిత హామీలకు రూ.52వేల కోట్లు!
ఎన్నికల్లో ఇచ్చిన అయిదు ఉచిత పథకాలను అమలు చేయడానికి ప్రత్యేకంగా 52,000 కోట్ల రూపాయలను కేటాయించింది సిద్ధరామయ్య ప్రభుత్వం. ఈ ఐదు ఉచిత పథకాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా కోటి 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.