కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఇంకా పరిష్కారం కాకముందే ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రతిపక్ష నేతలతో తన ఇంట్లో సమావేశమయ్యారు. దాదాపు దేశంలోని అన్ని ప్రతిపక్షాల ముఖ్య నాయకులు సిబల్ సోమవారం రాత్రి ఇచ్చిన విందుకు హాజరయ్యారు. దిల్లీలోని తీన్‌మూర్తి లేన్‌లోని ఆయన నివాసంలోనే ఈ భేటీ జరిగింది.
దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కపిల్ సిబల్ ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సాధించాలంటే సంస్థాగతంగా సంస్కరణలు అవసరమని అధిష్టానంపై బాహటంగా అసమ్మతి వ్యక్తం చేసిన జీ-23 నేతల్లో కపిల్ సిబల్ ముఖ్య నాయకులు. ఈ గ్రూప్‌లో ఉన్న సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, శశి థరూర్, మనీశ్ తివారీ కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఇంకా అంతర్గత విభేదాలతో సతమతమవుతుండటం గమనార్హం. గాంధీలు లేకుండానే సిబల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకులు అఖిలేశ్ యాదవ్ సహా ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఐక్య కూటమికి దూరంగా ఉన్న ఆకాలీదళ్, బీజేడీ, వైకాపా, తెదేపా నేతలు కూడా సిబల్ నివాసంలో విందుకు హాజరుకావడం ఆసక్తికరంగా మారింది.
రాహుల్ సమావేశానికి రాని వారు కూడా..
కేంద్రానికి వ్యతిరేకంగా వ్యూహాన్ని రూపొందించేందుకు రాహుల్ గాంధీ ఇటీవలే ప్రతిపక్ష నేతలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి హాజరుకాని పార్టీలను కూడా ఏకం చేసే విషయంలో సిబల్ సఫలీకృతమయ్యారు. కాంగ్రెస్‌లో అసమ్మతి వర్గం జీ23 నేతల్లో కీలకంగా ఉన్న ఆయన.. పార్టీలో సంస్థాగత మార్పుల తీసుకురావాలని లేఖ రాసిన తర్వాత కూడా.. సొంత పార్టీ నేతలపై చాలాసార్లు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే తన శక్తి సామర్థ్యాలేంటో కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే సిబల్ ప్రతిపక్ష నేతలతో సమావేశం నిర్వహించారని పార్టీ వర్గాలు తెలిపాయి. తనను పక్కకు పెట్టొద్దనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అయితే కపిల్ సిబల్ కార్యాలయం మాత్రం ఇందుకు భిన్నమైన ప్రకటన విడుదల చేసింది. ఇది ఆయన వ్యక్తిగత విందు సమావేశం అని, రాజకీయాలతో సంబంధం లేదని తెలిపింది.