దిల్లీలో యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన దిల్లోలో కారు ఢీకొని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లగా మృతి చెందిన అంజలీ సింగ్ శవపరీక్షల నివేదిక మంగళవారం వెలువడింది. అంజలి జననాంగాలపై ఎటువంటి గాయాలు లేవని వైద్యబృదం తేల్చింది. ఈ నివేదిక బట్టి.. ఆమెపై ఎటువంటి లైంగిక వేధింపులు జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. సోమవారం దిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో మెడికల్ బోర్డు శవపరీక్ష నిర్వహించింది. బాధితురాలు కుటుంబానికి దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అనంతరం వారి తరపున కోర్టులో పోరాడడానికి లాయర్‌ను కూడా నియమిస్తున్నట్లు తెలిపారు.
కొత్త ఏడాది రోజు తెల్లవారుజామున దిల్లీలో జరిగిన అమానవీయ ఘటనలో పోలీసులు శరవేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాద సమయంలో ద్విచక్రవాహనంపై.. చనిపోయిన యువతితోపాటు మరో యువతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారు ఢీకొట్టిన ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు కాగా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఆ ప్రాంతంలోని సీసీటీవీలను పరిశీలిస్తుండగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ యువతిని వెతికేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఘటనకు ముందు వారిద్దరూ స్కూటీపై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఆ ఘటనపై ఆమెను ప్రశ్నిస్తే కేసులో పురోగతి సాధించేందుకు పోలీసులకు కీలక విషయాలు వెల్లడి కానున్నాయి.
హోటల్ బయట అంజలితో గొడవ పడుతున్న మరో యువతి ఆదివారం రోజున తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన కారు.. దాదాపు 13 కిలోమీటర్లు ఆమెను ఈడ్చుకెళ్లింది. కారు టైరులో యువతి కాలు ఇరుక్కుపోవడం వల్ల ఆమెను లాక్కెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటన సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళను ఢీకొట్టిన తర్వాత భయంతో పారిపోయినట్లు చెప్పారని తెలిపారు. కారు టైరులో ఏదో ఇరుక్కుపోయినట్లు నిందితుల్లో ఒకరు మిగితా వారికి చెప్పగా.. వారు దాన్ని పట్టించుకోలేదని విచారణలో వెల్లడైంది. కాంజావాలా ప్రాంతంలో కారు మలుపు తీసుకుంటుండగా.. యువతి చేయి కనిపించినట్లు తెలిపిన నిందితులు.. కారును ఆపినట్లు తెలిపారు. తర్వాత కారు నుంచి యువతి మృతదేహం వేరు కాగానే అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులకు వివరించారు.
కాగా, స్కూటీపై వెళ్లే ముందు యువతులు ఇద్దరూ వాదించుకున్నారని హోటల్ యజమాని తెలిపాడు. ఘటనకు ముందు ఇదే హోటల్ నుంచి ఇరువురూ బయల్దేరారు. ఘర్షణ పడొద్దని తాము వారించామని యజమాని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ ఇద్దరూ వారించుకున్నారని పేర్కొన్నాడు.
ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిపై నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసులు నమోదు చేశారు. అటు.. యువతిపై అత్యాచారం జరిగి ఉంటుందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించగా.. శవపరీక్షల నివేదిక ఆధారంగా అలాంటి జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.