తమిళనాడు తన పార్టీకి క్రమంగా మద్దతు పెరుగుతోందని.. అవినీతి విధానాలను అవలంబించే పార్టీలకు ఇది నచ్చట్లేదని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచార వేగం పెంచారు. దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ నినాదం 'నాలై నమధే' (రేపటి రోజు మనదే) అనే నినాదాన్ని కమల్ ఉటంకించారు. ఎంజీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తే.. అన్నాడీఎంకే, డీఎంకేలు అవినీతికి అగ్ర తాంబూలం ఇస్తున్నాయని ఆరోపించారు. ప్రజలే మార్పునకు నాంది పలకాలన్నారు.
మహిళల మద్దతు..
అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనకు మహిళలు మద్దతుగా నిలుస్తున్నారని.. తన సభలకు వారు పెద్దఎత్తున తరలిరావడం ఎన్నికల విజయంపై నమ్మకాన్నిస్తోందని కమల్ అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని ఆరోపించారు. ఈ పరిస్థతి మారాల్సిన అవసరం ఉందని.. ఎన్నికలను చరిత్రాత్మక అవకాశంగా భావించి తన పార్టీని ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.