సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతితో పాటు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో లాంఛనంగా ఈ కార్యక్రమం సాగింది. 44 ఏళ్ల క్రితం తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేస్తే, ఇప్పుడు తనయుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి. కొత్త ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో సరిగ్గా రెండేళ్లు కొనసాగుతారు.
'మాటలతో కాదు.. పని తీరుతోనే విశ్వాసం కల్పిస్తా'
మాటలతో కాకుండా.. పని తీరుతోనే ప్రజలకు విశ్వాసం కల్పిస్తానని స్పష్టం చేశారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్. సామాన్య ప్రజలకు సేవ చేయడమే తన మొదటి ప్రాధాన్యమని అన్నారు. సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సుప్రీంకోర్టు ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. టెక్నాలజీ, రిజిస్ట్రీ, న్యాయవ్యవస్థలో.. ఇలా ఏ విభాగంలో సంస్కరణలు చేపట్టినా పౌరుల్ని దృష్టిలో ఉంచుకుంటానని వివరించారు.
ఏడేళ్లు సీజేఐగా రికార్డు సృష్టించిన జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్
44 ఏళ్ల క్రితం జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ల అయిదు నెలలపాటు ఆ పదవిలో కొనసాగి సుదీర్ఘకాలం కొనసాగిన సీజేఐగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ స్థానానికి చేరుకుంటున్న జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10వరకు సీజేఐగా కొనసాగుతారు. 1959 నవంబరు 11న బాంబేలో జన్మించిన జస్టిస్ చంద్రచూడ్ 2016 మే 13న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకుముందు 2000 మార్చి 29న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2013 అక్టోబరు 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. అంతకుముందు 1998 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంతవరకూ అడిషినల్ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్‌లో 1983లో స్కాలర్‌షిప్ మీద ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ చేశారు. అక్కడ అత్యధికమార్కులు సాధించి జోసెఫ్ హెచ్.బీలె ప్రైజ్ దక్కించుకున్నారు. జ్యుడిషియల్ సైన్సెస్‌లో డాక్టరేట్ పూర్తిచేసే వరకు(1986) అదే యూనివర్సిటీలో ఉన్నారు. అంతకుముందు దిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనమిక్స్‌లో బీఏ, దిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్‌లో ఎల్‌ఎల్‌బీ చేశారు. ముంబయి యూనివర్సిటీ, అమెరికాలోని ఒక్లహామా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో సందర్శక ఆచార్యుడు(విజిటింగ్ ప్రొఫెసర్)గానూ సేవలందించారు. మహారాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. ఆయన న్యాయవాదిగా ఉన్నప్పటి నుంచి సామాజిక అంశాలపై సూక్ష్మదృష్టి సారించిన వ్యక్తిగా పేరుంది.