కొందరు శారీరక వైకల్యాన్ని కారణంగా చూపుతూ ఏ పని చేయకుండా ఖాళీగా ఉండిపోతారు. మరికొందరు సవాళ్లను అధిగమించి సత్తా చాటుతారు. ఆ కోవకు చెందినవాడే ఝార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాకు చెందిన సౌరభ్ ప్రసాద్. చిన్నతనంలోనే చూపు కోల్పోయిన అతడు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ కుంగిపోకుండా బ్రెయిలీ లిపిలో చదువుకుంటూ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్‌లో జాబ్ సంపాదించాడు. అనుకున్నది సాధించాలనే తపన ఉంటే వైకల్యం ఎన్నటికీ అడ్డురాదని నిరూపించాడు.
జిల్లాలోని తాండ్వా బ్లాక్ ప్రాంతంలోని చట్టీగాడీలోంగ్ గ్రామానికి చెందిన సౌరభ్ ప్రసాద్ చిన్నప్పటి నుంచి గ్లకోమా అనే కంటి వ్యాధితో బాధపడుతున్నాడు. 11 ఏళ్ల వయసులో పూర్తిగా చూపు కోల్పోయాడు. కానీ సౌరభ్ మాత్రం అంధత్వాన్ని ఎప్పుడూ శాపంగా భావించలేదు. అందుకే బ్రెయిలీ లిపిలో చదువుకుంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. ఎటువంటి అడ్డంకి లేకుండా సౌరభ్ చదువు ఏడో తరగతి వరకు సాగింది.
కానీ ఎనిమిదో తరగతికి వచ్చిన అతడికి పెద్ద తలనొప్పి వచ్చి చేరింది. ఎందుకంటే 8,9,10 తరగతుల పుస్తకాలు బ్రెయిలీ లిపిలో ప్రభుత్వం ముద్రించలేదు. అయితే అనేక అభ్యర్ధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడు తరగతుల పుస్తకాలను ముద్రించి సౌరభ్‌కు అందించింది. పదో తరగతి పరీక్షల్లో అతడు 97 శాతంతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించి దిల్లీ ఐఐటీలో సీటు సంపాదించాడు. ప్రస్తుతం ఇంజినీరింగ్ సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ క్యాంపస్‌లో మైక్రోసాఫ్ట్ కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రూ.51 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు.