తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ఇప్పటివరకూ ప్రపంచానికి తెలిసిన వాస్తవాలకు విరుద్ధంగా ఈ అంశాలు ఉండడం చర్చనీయాంశంగా మారింది. జయలలిత మరణాన్ని డిసెంబర్ 5న అధికారికంగా ప్రకటించగా... సాక్ష్యాధారాల ఆధారంగా ఆమె డిసెంబర్ 4న మరణించినట్లు జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నిర్ధరణకు వచ్చింది. జయలలితకు చికిత్స అందించిన సమయంలో అక్కడి ప్రత్యేక వార్డులో పనిచేసిన పారామెడికల్ సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం.. ఆమె 2016 డిసెంబర్ 4 సాయంత్రం 3.50 నిమిషాలకు మరణించారని నివేదికలో పేర్కొంది కమిషన్. ఆస్పత్రి వర్గాలు మాత్రం 2016 డిసెంబర్ 5న రాత్రి 11.30 నిమిషాలకు మరణించారని ప్రకటించినట్లు గుర్తు చేసింది.
జయలలిత మృతి కేసులో ట్విస్ట్.. శశికళపై డౌట్స్.. చనిపోయాక 31 గంటల తర్వాత.. - జయలలిత మృతిపై నివేదిక
జయలలిత మృతిపై ప్రభుత్వం వేసిన జస్టిస్ ఆరుముగసామి కమిషన్ తన నివేదికను తమిళనాడు శాసనసభ ముందు ప్రవేశపెట్టింది. ఈ వ్యవహారంలో జయలలిత స్నేహితురాలు శశికళను విచారించాలని సిఫార్సు చేసింది. దీంతో పాటు మరికొన్ని సంచలన విషయాలు నివేదికలో బయటపడ్డాయి.
శశికళకు ఉచ్చు...
2012లో శశికళను.. పోయెస్ గార్డెన్ నుంచి పంపించినప్పటి నుంచి జయలలితతో ఆమెకు సత్సంబంధాలు లేవని నివేదిక పేర్కొంది. జయలలిత విషయంలో జరిగిన వరుస సంఘటనలన్నీ శశికళనే దోషిగా చూపిస్తున్నాయని కమిషన్ పేర్కొంది. ఈ వ్యవహారంలో శశికళను విచారించాలని సిఫార్సు చేసింది. ఆమెతో పాటు అప్పటి ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, వైద్యారోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్‌లపై విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది.
సరైన వైద్యం చేసి ఉంటే...
జయలలితకు సరైన చికిత్స అందించి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని జస్టిస్ ఆరుముగసామి కమిషన్ పేర్కొంది. జయలలితకు యాంజియోగ్రఫీ చేయాలని డాక్టర్ సుమిన్ శర్మ సూచించిన తర్వాత కూడా ఆమెకు యాంజియోగ్రఫీ చేయలేదని కమిషన్ పేర్కొంది. వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమని డాక్టర్ రిచర్డ్ పీలే చెప్పిన తర్వాత కూడా.. అది కార్యరూపంలోకి రాలేదని నివేదికలో పేర్కొంది. 2016 సెప్టెంబరులో జయలలిత స్పృహతప్పి పడిపోయినప్పటి నుంచి అంతా గోప్యంగానే ఉందని పేర్కొంది.