జామా మసీదులోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించడంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో.. మసీదు యాజమాన్యం వెనక్కు తగ్గింది. నిషేధం ఉత్తర్వుల్ని వెనక్కు తీసుకుంది. ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సూచించిన కాసేపటికే ఈమేరకు చర్యలు చేపట్టింది.
అంతకుముందు దిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదులోకి.. మహిళ ప్రవేశాన్ని యాజమాన్యం నిషేధించింది . ఒంటరిగా లేదా బృందంగా వచ్చిన సరే అమ్మాయిలకు ప్రవేశంలేదని.. జామా మసీదు మూడు ప్రవేశ ద్వారాల వద్ద నోటీసులు అంటించింది. కాగా యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ వివరణ ఇచ్చారు. మసీదులో ప్రార్థనలకు వచ్చేవారిపై.. ఎలాంటి ఆంక్షలులేవన్నారు. గురువారం కూడా 20 నుంచి 25 మంది అమ్మాయిలు వచ్చి.. ప్రార్థనలు చేసుకున్నట్లు చెప్పారు. కానీ కొందరు అమ్మాయిలు ఇక్కడకు ఒంటరిగా వచ్చి తమ ప్రియుల కోసం వేచిచూస్తున్నారని ఆయన ఆరోపించారు. మసీదులు, ఆలయాలు, గురుద్వారాల్లో అలాంటి చర్యలను అనుమతించరని బుఖారీ చెప్పారు. ప్రార్థనా మందిరాలు దైవాన్ని ఆరాధించడానికి మాత్రమేనని స్పష్టంచేశారు.