హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో ఆదివారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. 9 మంది పర్యటకుల ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి.. అదే చివరిరోజుగా మిగిలిపోయింది. మరణించిన పర్యటకుల్లో.. రాజస్థాన్‌కు చెందిన ఓ వైద్యురాలి కథ అందరికి కంటతడి పెట్టిస్తోంది. 'దేశంలో పౌరులు చేరుకునే చివరి ప్రదేశానికి వెళ్లా'నంటూ ఆమె ఫొటో ట్వీట్ చేసిన కాసేపటికే ఆమె కన్నుమూసింది.
నెటిజన్ల భావోద్వేగం..
ఆయుర్వేద వైద్యురాలైన దీపా శర్మ.. రాజస్థాన్ జైపుర్వాసి. తన 38వ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు తన స్నేహితులతో కలిసి ఆమె వెళ్లింది. అయితే ఆదివారం జరిగిన ఘటనలో.. ఆమె వాహనంపై బండరాళ్లు దూసుకువచ్చి పడగా.. ప్రాణాలు కోల్పోయింది. దీప సోదరుడు మహేశ్ కుమార్ శర్మ.. తన సోదరి ఎలా మరణించిందో ట్వీట్ చేశాడు. ఆమెకు ప్రకృతిపై ఎంత ప్రేమ ఉందో వివరించాడు. ఆ ట్వీట్ చదివిన నెటిజన్లు దీపా శర్మ మృతి పట్ల భావోద్వేగానికి లోనవుతున్నారు.
"జులై 29న తన 38వ పుట్టినరోజును జరుపుకునేందుకు స్పితి లోయ పర్యటనకు నా సోదరి దీపా శర్మ బయల్దేరింది. ఈ పర్యటనపై చాలా సంతోషపడింది. ప్రత్యేకంగా ఓ కొత్త ప్రొఫెషనల్ కెమెరా, కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసింది. తనకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. కానీ, అదే ప్రకృతి నా చెల్లెలిని పొట్టనబెట్టుకుంది."