తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉపరాష్ట్రపతిని పార్లమెంట్​ కాంప్లెక్స్​లో అవమానించడం బాధాకరం'- మిమిక్రీ ఘటనపై మోదీ కౌంటర్ - ఉపరాష్ట్రపతి మిమిక్రీ ఘటనపై లోక్​సభ స్పీకర్​

Jagdeep Dhankhar Kalyan Banerjee Mimicry Issue : ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను అవమానించేలా టీఎంసీ ఎంపీ మిమిక్రీ చేసిన ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ విషయమై ధన్‌ఖడ్‌కు ప్రధాని ఫోన్​ చేసి మాట్లాడినట్లు ఉప రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. అలాగే ఈ వ్యవహారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Jagdeep Dhankhar Kalyan Banerjee Mimicry Issue
Jagdeep Dhankhar Kalyan Banerjee

By PTI

Published : Dec 20, 2023, 12:17 PM IST

Updated : Dec 20, 2023, 2:02 PM IST

Jagdeep Dhankhar Kalyan Banerjee Mimicry Issue : రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను అవమానించేలా టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ మిమిక్రీ చేయటంపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారని పేర్కొన్న ఆయన సచివాలయం, పవిత్రమైన పార్లమెంటు కాంప్లెక్స్‌లో రాజ్యసభ ఛైర్మన్‌ను అవమానించటం విచారకరమని పేర్కొన్నట్లు తెలిపింది.

'ఇలాంటి అవమానాలు నా లక్ష్యాన్ని మార్చలేవు'
ప్రతిపక్షం తనను కూడా 20ఏళ్ల నుంచి అవమానిస్తోందని, ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతిని, అదీ కూడా పార్లమెంటు కాంప్లెక్స్‌లో అవమానించటం దురదృష్టకరమని ప్రధాని విచారం వ్యక్తంచేసినట్లు ఉప రాష్ట్రపతి ధన్‌ఖఢ్‌ ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. అలాంటి ఘటనలు తన విధి నిర్వహణను అడ్డుకోలేవని, తాను కూడా ప్రధానికి చెప్పినట్లు ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి పనిచేయటమే కాకుండా అలాంటి అవమానాలు తాను నిర్దేశించుకున్న మార్గాన్ని మార్చలేవని కూడా స్పష్టం చేసినట్లు ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ తెలిపారు.

'ఉపరాష్ట్రపతిని అవమానించడాన్ని చూసి విస్తుపోయాను'
'గౌరవనీయులు ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​పై సదరు ఎంపీ పార్లమెంటు కాంప్లెక్స్‌లో మిమిక్రీ చేయడాన్ని చూసి నేను విస్తుపోయాను. ప్రజాప్రతినిధులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపర్చుకోవచ్చు. కానీ, ఆ భావవ్యక్తీకరణ అనేది నిబంధనలకు లోబడి ఉండాలి. ఇతరుల గౌరవ మర్యాదలకు భంగం కలిగించేదిగా ఉండకూడదని హితవు పలికారు. అది పార్లమెంట్​ సంప్రదాయం. అందుకు మేము గర్విస్తున్నాము. దీనిని దేశ ప్రజలు కాపాడతారని నేను ఆశిస్తున్నాను' అని పార్లమెంట్‌ ఆవరణలో జరిగిన నిరసన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్​ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

'నన్ను అవమానించినా ఫర్వాలేదు- కానీ'
మరోవైపు తనను మిమిక్రీ చేయడంపై రాజ్యసభలో స్పందించారు ఉపరాష్ట్రపతి జగ్​దీప్​ ధన్​ఖడ్​. తనను ఎంత అవమానించినా పట్టించుకోని గానీ, పవిత్రమైన పార్లమెంట్​ను, ఉపరాష్ట్రపతి పదవిని అవమానిస్తే మాత్రం సహించేది లేదని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సహా కాంగ్రెస్​ పార్టీ ముఖ్యనేతలు ఈ వ్యవహారంపై ఆలోచించాలని కోరారు.

"నన్ను ఎవరూ ఎంత ఎగతాళి చేసినా నేను పట్టించుకోను. కానీ, పవిత్రమైన పార్లమెంట్​ను, ఉభయ సభాపతుల పదవులను, రైతులను అలాగే నా సామాజిక వర్గాన్ని అవమానిస్తే మాత్రం అస్సలు ఊరుకోను. సభ, దానిని నిర్వహిస్తున్న నా పదవి గౌరవాన్ని కాపాడుకోవడం నా ప్రథమ కర్తవ్యం."
- జగదీప్‌ ధన్‌ఖడ్‌, ఉపరాష్ట్రపతి

'నా మిమిక్రీ ఎవరినీ ఉద్దేశించినది కాదు'
మాక్‌ పార్లమెంటు సందర్భంగా తాను చేసిన మిమిక్రీ ఎవరినీ ఉద్దేశించినదికాదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ చెప్పారు. మాక్‌ పార్లమెంటు లోక్‌సభ గురించా, రాజ్యసభ గురించా అనేది తానెక్కడా చెప్పలేదన్నారు. తనకంటే సీనియర్‌గా, మాజీ గవర్నర్‌గా, ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌ అంటే తనకు ఎంతో గౌరవమని, పార్లమెంటు వద్ద విపక్ష ఎంపీల నిరసన సందర్భంగా కల్యాణ్‌ బెనర్జీ చెప్పారు.

"ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు. ధన్‌ఖడ్‌ కూడా నా వృత్తికి చెందినవారే. ఆయన సీనియర్‌ న్యాయవాది, నేనూ సీనియర్ న్యాయవాది. మా వృత్తిలో మేము ఎవరినీ కించపరచం ఆ ఉద్దేశం నాకు లేదు. ఆయన(ధన్‌ఖడ్‌) ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థంకావడంలేదు. నా ప్రశ్న ఏమిటంటే ధన్‌ఖడ్‌ రాజ్యసభలో అలాగే ప్రవర్తిస్తారా? ధన్‌ఖడ్‌ను నేను చాలా గౌరవిస్తాను. నా మిమిక్రీ ఒక మాదిరి కళ. మిమిక్రీ ప్రధానమంత్రి లోక్‌సభలో చేసి చూపించారు. నేను వీడియో కూడా చూపిస్తాను. ఆయన గతంలో 2014 నుంచి 2019 వరకూ లోక్‌సభలో చేశారు. కానీ అందరూ తేలిగ్గానే తీసుకున్నారు. తీవ్రంగా పరిగణించలేదు. నా విషయంలో సీరియస్‌గా తీసుకుంటే నేనేమీ చేయలేను."
- కల్యాణ్‌ బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ

'ఇది తీవ్ర దుష్ప్రవర్తన'
పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఉపరాష్ట్రపతిని అవమానించిన తీరుపట్ల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన సందర్భంగా ఎంపీలు చేసింది ఓ తీవ్రమైన దుష్ప్రవర్తన అని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా జగదీప్​ ధన్​ఖడ్​ను స్పీకర్​ ఓం బిర్లా ప్రత్యక్షంగా కలిసినట్లు లోక్​సభ స్పీకర్​ కార్యాలయం తెలిపింది. మరోవైపు ఎన్​డీఏకు చెందిన రాజ్యసభ ఎంపీలందరూ జగదీప్​ ధన్​ఖడ్​కు అండగా నిలుస్తున్నారు. ఈ మేరకు రాజ్యసభలో ఆయనకు తమ మద్దతును ప్రకటించారు.

దన్​ఖడ్​కు మద్దతుగా జాట్​ నేతలు
ఉపరాష్ట్రపతిని మిమిక్రీ చేసిన టీఎంసీ ఎంపీతో పాటు దానిని సమర్థించిన మిగతా ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జాట్​ సామాజిక వర్గం. ఈ వ్యవహారంలో జగదీప్​ దన్​ఖడ్​తో పాటు దేశంలోని ప్రతిరైతుకు కల్యాణ్‌ బెనర్జీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు జాట్​ సంఘం నేత చౌదరీ సురేంద్ర సోలంకీ. లేనిపక్షంలో టీఎంసీకి వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. 'రైతు కుటుంబంలోని వ్యక్తిని(ఉపరాష్ట్రపతి) అవమానించిన తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చర్యను సహించబోము' అని సురేంద్ర సోలంకీ మండిపడ్డారు.

ఇండియన్​ నేవీలో 910​ ఉద్యోగాలు​ - దరఖాస్తుకు మరో 11 రోజులే ఛాన్స్​!

'కేంద్రం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోంది'- సస్పెన్షన్​ వేటుపై పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీల నిరసన

Last Updated : Dec 20, 2023, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details