రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సులభంగా దేశం దాటగలరని కోర్టుకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) వెల్లడించింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో విచారణ జరిగింది. ఆమెకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ దర్యాప్తు సంస్థ వాదనలు వినిపించింది. అయితే ఆమెను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది.
"ఎల్‌ఓసీ జారీ చేసినప్పటికీ.. జాక్వెలిన్‌ను ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదు? ఇతర నిందితులు జైల్లో ఉన్నారు. కానీ, ఆమె విషయంలో మీరు ప్రత్యామ్నాయం ఎందుకు ఎంచుకున్నారు?" అని ఈడీని కోర్టు ప్రశ్నించింది. ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై రేపు తీర్పు ఇవ్వనుంది. ఇంతకుముందు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.