జమ్ముకశ్మీర్‌లో సాధారణ పౌరులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో.. పోలీసులు ఉగ్ర ఏరివేత చర్యలు చేపట్టారు. బందిపొరాలో లష్కర్ ఏ తోయిబా(ఎల్ఈటీ) ఉగ్ర స్థావరాన్ని పోలీసులు ఛేదించారు. నైద్ఖాయ్కు చెందిన మహమ్మద్ షఫీ లోనే అలియాస్ సోను అనే వ్యక్తి హత్య కుట్రలో భాగమైన నలుగురు ఉగ్ర అనుచరులను అరెస్టు చేశారు.
బందిపొరా పోలీసులతో కూడిన ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. సిబ్బంది, సాంకేతికత సాయంతో ఎల్ఈటీకి చెందిన నలుగురు ఉగ్ర అనుచరులను అరెస్టు చేసింది. వీరిని తారిఖ్ అహ్మద్ దార్, మహమ్మద్ షఫీ దార్, ముదాసిర్ హసన్‌లోనే, బిలాల్ అహ్ దార్గా పోలీసులు గుర్తించారు.
మహమ్మద్ షఫీ లోనే హత్యలో కీలక పాత్ర పోషించిన ఇంతియాజ్ ఆహ్ దార్ అనే ఉగ్ర అనచరుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడు ఉగ్రమూకలతో కలిసి పోయినట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో.. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది లాలా ఉమర్ ఆదేశాలతోనే ఈ హత్య జరిగినట్లు తేలిందని పోలీసులు తెలిపారు.
అనంత్‌నాగ్‌లో..
మరోవైపు.. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అనంత్‌నాగ్ జిల్లా ఖాగుండ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాదిని భద్రతా బలగాలు సోమవారం మట్టుబెట్టాయి. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్లో తెలిపారు.