ఉగ్రవాద సంబంధిత కేసులను మరింత సమర్థవంతంగా, వేగంగా దర్యాప్తు చేపట్టేందుకు జమ్ముకశ్మీర్ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐఏ) ఏర్పాటుకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఏ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలకు.. ఎస్ఐఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుందని ప్రకటనలో పేర్కొంది. ఈ ఆదేశాల ప్రకారం.. ఇకపై ఉగ్రవాద సంబంధిత కేసులను పోలీసులు నమోదు చేస్తే ఆ సమాచారాన్ని ఎస్ఐఏకు అందించాల్సి ఉంటుంది.
ఎన్ఐఏ ఈ కేసుల దర్యాప్తును చేపట్టకపోతే.. ఆ కేసును విచారణపై జమ్ముకశ్మీర్ పోలీస్ యంత్రాంగం, ఎస్ఐఏ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం పేర్కొంది. కేసు ఎవరికి అప్పగించాలనే విషయంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం డీజిపీకే ఉంటుందని స్పష్టం చేసింది. ఎస్ఐఏకు కేసు బదిలీ కాని పక్షంలో ఆ దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఎస్ఐఏకు అందిస్తూ ఉండాలని తెలిపింది. అవసరమైతే ఎస్ఐఏ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపట్టవచ్చని వెల్లడించింది.
ఈ ఏజెన్సీకి సీఐడీ విభాగ అధిపతి ఎక్స్-అఫీషియో డైరెక్టర్గా వ్యవహరిస్తారని ప్రకటనలో పేర్కొంది.