IT Raids on Chinese Companies:దేశంలో చైనా ఆధారిత మొబైల్ ఫోన్ కంపెనీల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఒప్పో, షావోమీ, వన్‌ప్లస్, ఫిన్‌టెక్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. దిల్లీ, నోయిడా, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, గువాహటి, ఇందోర్ సహా పలు నగరాల్లో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
భారత్‌లోని చైనా కంపెనీలు భారీగా పన్ను ఎగవేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ తనిఖీలు జరిపింది ఐటీ శాఖ. ఆయా కంపెనీల సీఈఓలను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
గత ఆగస్టులో చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న టెలికాం దిగ్గజం జెడ్టీఈపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. సంస్థకు చెందిన ఐదు యూనిట్లు, ఫారెన్ డైరెక్టర్ నివాసం, కంపెనీ సెక్రటరీల ఇళ్లలో కూడా తనిఖీలు జరిపింది. ఈ క్రమంలో సంస్థ 30 శాతం లాభాల్లో ఉన్నప్పటికీ భారీ నష్టాల్లో ఉన్నట్లు పత్రాల్లో చూపించారని ఐటీ అధికారులు గుర్తించారు.
Actor Vijay IT Raids:పన్ను ఎగవేత ఆరోపణలతో తమిళ స్టార్ హీరో విజయ్ దగ్గరి బంధువు జేవియర్ బ్రిటో నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. చెన్నై అడయార్‌లోని ఆయన నివాసంతో పాటు కార్యాలయంలో సోదాలు చేశారు. రెండు రోజులుగా ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
చైనాకు చెందిన షావోమీ కంపెనీ విడిభాగాల ఎగుమతులు, దిగుమతులను బ్రిటో కంపెనీ నిర్వహిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ఆధారంగా చేసుకొని కంపెనీకి చెందిన 25 కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బ్రిటో నివాసంలోనూ సోదాలు జరిపినట్లు వివరించారు.