YS Vivekananda Reddy: 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత పులివెందులలోని సొంత ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. ఉదయం 6 గంటల 15నిమిషాలకు వివేకా పీఏ కృష్ణారెడ్డి ద్వారా హత్య జరిగిన విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఉదయం 6 గంటల 29 నిమిషాలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డితోపాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుండెపోటుతో వివేకా చనిపోయారని తొలుత ప్రచారం జరిగింది. అందుకే మృతదేహానికి కుట్లు వేసి, బ్యాండేజ్ చుట్టి, ఇంట్లోని రక్తపు మరకలు తుడిచేశారని.. ఈ వ్యవహారంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి.
సునీత పిటిషన్...వివేకా హత్య జరిగిన రోజే అదనపు డీజీ అమిత్ గార్గ్ నేతృత్వంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసింది. పలువురు అనుమానితులు, సాక్షులను సిట్ విచారించింది. ఆ తర్వాత ఎస్పీ అభిషేక్ మహంతి నేతృత్వంలో రెండో సిట్, ప్రస్తుత ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యాన మూడో సిట్ కూడా విచారణ జరిపాయి. మొత్తంగా 100 మంది సాక్షులు, 1461 మంది అనుమానితులను విచారించినా.. హంతకులు ఎవరనేది మాత్రం దర్యాప్తు బృందాలు తేల్చలేకపోయాయి. హత్యకేసుపై సీబీఐ విచారణ కోరుతూ గతంలో పిటిషన్ వేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఉపసంహరించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో వివేకా కుమార్తె సునీత.. సీబీఐ విచారణ చేయించాలంటూ 2019 నవంబరులో హైకోర్టును ఆశ్రయించారు. వివేకా భార్య సౌభాగ్యమ్మ, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి కూడా పిటిషన్లు వేశారు. సునీత పిటిషన్‌ను మాత్రం స్వీకరించిన హైకోర్టు.. 2020 మార్చి 11న వివేకా కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించింది.
అప్రూవర్‌గా మారిన దస్తగిరి..కోర్టు ఆదేశాలతో 2020 జులై 9న రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. జులై 18న కడపలో విచారణ ప్రారంభించారు. కడప, పులివెందులలో పలువురు సాక్షులు, అనుమానితులను ప్రశ్నించారు. ఇప్పటివరకు 248 మంది విచారణ చేశారు. వివేకా ఇంటి వద్ద రెండుమూడు పర్యాయాలు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేశారు. 2021 జులై 23న జమ్మలమడుగు కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన వాచ్‌మన్ రంగన్న.. వివేకా హత్య జరిగిన రోజు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ఇంట్లోకి వచ్చారని పేర్కొన్నాడు. ఈ విషయం బయటికి చెబితే చంపేస్తానని ఎర్ర గంగిరెడ్డి బెదిరించినట్లు తెలిపాడు. ఆ తర్వాత సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ పరిణామాల తర్వాత ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు.
వివేకా హత్యకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి 40 కోట్ల రూపాయల సుపారీ ఆఫర్ చేసినట్లు ఎర్ర గంగిరెడ్డి చెప్పారని వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మన వెనుక ఉన్నారని భరోసా ఇచ్చారని.. అడ్వాన్స్ కింద ఒక్కో నిందితుడికి కోటి రూపాయలు అందజేశారని వెల్లడించాడు. ఈమేరకు 2021 అక్టోబర్ 26న పులివెందుల కోర్టులో ప్రిలిమినరీ ఛార్జిషీట్ దాఖలుచేసిన సీబీఐ.. ఎర్ర గంగిరెడ్డి A-1గా, సునీల్ యాదవ్ A-2, ఉమాశంకర్‌రెడ్డి A-3, దస్తగిరిని A-4గా చేర్చింది. దస్తగిరి వాంగ్మూలంలోని అంశాల ఆధారంగా నవంబరు 17న A-5 దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కోర్టు అనుమతితో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.