ISRO Somnath on Chandrayaan 3 Landing :దేశమంతా చంద్రయాన్-3 జాబిల్లిపై అగుపెట్టడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన దేశ ప్రజల నమ్మకాన్ని మరింత పెంచింది. బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోమనాథ్.. ఆగస్టు 23న చంద్రయాన్-3 సురక్షితంగా జాబిల్లిపై దిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టులో 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ వేగాన్ని తగ్గించడమే అత్యంత కష్టమైన ప్రక్రియని వివరించారు. చంద్రయాన్-2 సమయంలో ఈ దశలో జరిగే ప్రక్రియల్లోనే సమస్యలు తలెత్తాయని గుర్తుచేశారు.
Chandrayaan 3 Update :చంద్రయాన్-2 వైఫల్యంతో చంద్రయాన్-3 డిజైన్ చాలా జాగ్రత్తగా రూపొందించామని సోమనాథ్ తెలిపారు. డిజైన్ వైఫల్యాలను తట్టుకోగలిగేలా ల్యాండర్ విక్రమ్‌ను తయారు చేశామని చెప్పారు. ఎక్కువ ఇంధనం వాడుకోకుండా చూడటమే కాకుండా దూరాన్ని కచ్చితంగా లెక్కించామని వెల్లడించారు. ఆగస్టు 23న ల్యాండర్‌లోని సెన్సర్లు విఫలమైనా, రెండు ఇంజిన్లు పనిచేయకపోయినా ల్యాండర్ సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపైకి చేరగలదని సోమనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Chandrayaan 3 Launch Date :చంద్రయాన్-3 జూలై 14న అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆగస్టు 23న జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అవుతుంది. విక్రమ్ ల్యాండర్‌ను నిలువుగా ల్యాండ్ చేయడమే అత్యంత క్లిష్టమైన ప్రక్రియన్న ఇస్రో ఛైర్మన్.. ఆ వైఫల్యాలను కూడా చంద్రయాన్-3 తట్టుకోగలదని తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ను దించడం కోసం స్థలాన్ని గుర్తించామని తెలిపారు.