Iron Poles On Train Track In Gujarat :అహ్మదాబాద్-పురీ రైలుతో పాటు మరో ట్రైన్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైళ్లను పట్టాలు తప్పించడానికి గుర్తుతెలియని వ్యక్తులు కుట్ర పన్నడం కలకలం రేపింది. పట్టాలకు అడ్డంగా ఇనుప స్తంభాలను ఉంచారు. అయితే లోకో పైలట్ల అప్రమత్తతో రెండు రైళ్లకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకునన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం రాత్రి వడోదరలోని వర్ణ-ఇటోలా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఆ మార్గంలో రైలును పట్టాలు తప్పించడానికి దుండగులు కుట్ర పన్నారు. అందులో భాగంగా పట్టాలపై ఇనుప ఫెన్సింగ్ స్తంభాన్ని ఉంచారు. ఆదివారం రాత్రి అదే మార్గంలో వస్తున్న ఓఖా-షాలీమార్ రైలు ఆ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆ రైలుకు ఏం కాలేదు. అదే మార్గంలో వస్తున్న అహ్మదాబాద్-పురీ రైలు లోకో పైలట్ ఆ స్తంభాలను గమనించి.. రైలును నిలిపివేశాడు. అనంతరం ఇటోలా రైల్వే స్టేషన్ మాస్టర్‌కు సమచారం అందించాడు. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ కంట్రోల్‌కు విషయం చేరవేశాడు. రైల్వే శాఖ వెంటనే అధికారులను, పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.