దేశంలోకి డ్రగ్స్‌ను తరలించేందుకు ప్రయత్నించిన ఓ పడవను భారత కోస్టు గార్డు (ఐసీజీ) సిబ్బంది అడ్డుకున్నారు. ఇరాన్‌కు చెందిన ఆ బోటులో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరేబియా సముద్రం మీదుగా వచ్చిన వీరంతా.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న ఓఖా తీరానికి దగ్గర్లో పట్టుబడ్డారు. బోటులో 61 కేజీల హెరాయిన్‌ను వీరు తీసుకొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.425 కోట్లు ఉంటుందని చెప్పారు. తమకు నిఘా వర్గాల నుంచి అందిన కచ్చితమైన సమాచారం ప్రకారం ఈ ఆపరేషన్ నిర్వహించామని రక్షణ శాఖ ప్రజా సమాచార విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. డ్రగ్స్ రవాణా గురించి గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ సమాచారం ఇచ్చిందని పేర్కొంది. దీంతో కోస్టు గార్డు అధికారులు వెంటనే స్పందించారని తెలిపింది. రెండు ఫాస్ట్ పెట్రోల్ క్లాస్ షిప్‌లను పెట్రోలింగ్ కోసం రంగంలోకి దించారని తెలిపింది. అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా కనిపించే పడవలపై కోస్టు గార్డు నిఘా పెట్టినట్లు వెల్లడించింది.
"సోమవారం రాత్రి సమయంలో ఓ పడవ భారత జలాల్లోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించింది. ఓఖా తీరానికి 340 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. భారత్ వైపు వస్తున్న వారిని అడ్డుకునేందుకు కోస్టు గార్డు పడవలు ప్రయత్నించాయి. కానీ, వారు తప్పించుకునేలా ప్రవర్తించారు. పడవను కోస్టు గార్డు బోట్ల నుంచి దూరంగా పోనిచ్చారు. వారిని కోస్టు గార్డు వెంబడించింది. విజయవంతంగా వారిని అడ్డుకుంది. ఆ పడవ ఇరాన్‌కు చెందినదని తేలింది. ఐదుగురు ఇరాన్ జాతీయులు అందులో ఉన్నారు. కోస్టు గార్డు పడవలో ఉన్న అధికారులు.. ఇరాన్ బోటును తనిఖీ చేయగా 61 కేజీల మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. వాటి విలువ రూ.425 కోట్లు ఉంటుందని తేలింది. పడవను, అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నాం. వారిని తీరానికి తీసుకొచ్చాం. తదుపరి విచారణ జరుగుతోంది."
-రక్షణ శాఖ ప్రకటన