దిల్లీ పోలీసులు ఓ గజ గొంగను అరెస్టు చేశారు. నిందితుడు 1998 నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 5 వేల వాహనాలను దొంగతనం చేశాడు. ముఠా నాయకుడిగా ఉన్న 52 ఏళ్ల అనిల్ చౌహాన్.. 181 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పలు మార్లు జైలుకు వెళ్లొచ్చినా అతడి తీరు మారలేదు. చివరికి మరోసారి పోలీసులకు పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. అనిల్ చౌహాన్ కాన్పుర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతడి స్వస్థలం అసోంలోని తేజ్‌పుర్. అక్కడ ఖడ్గమృగం కొమ్ములు స్మగ్లింగ్ చేసేవాడు. ఇవే కాకుండా ఆయిధాలను అక్రమంగా రవాణా చేసేవాడు. ఇతడు అసోం ప్రభుత్వానికి క్లాస్-1 కాంట్రాక్టర్‌గా ఉండేవాడు. తర్వాత ఈడీ దాడులు చేసింది. ఆస్తులను జప్తు చేసి వేలం వేసింది. ఆ తర్వాత నుంచి అతడు దొంగతనాలు చేసేవాడని పోలీసులు తెలిపారు. అయితే ఇటీవల దిల్లీ తదితర ప్రాంతాల్లో ఆయుధాల అక్రమ రవాణా ఎక్కువైన కారణంగా ప్రత్యేక బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయని డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు. నిందితుడి గురించిన సమాచారం స్పెషల్ టీంల ద్వారా తెలిసిందని, ఆగస్టు 23న అతడిని అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుడు 2015లో ఓ ఎమ్మెల్యేతో పాటు అరెస్టు అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు.
"నిందితుడు అనిల్ చౌహాన్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశాం. అతడిని అరెస్టు చేసి ఒక నాటు తుపాకి, రెండు క్యాట్రిడ్జ్‌లు, ఒక దొంగిలించిన మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నాం. విచారణ జరుగుతున్న సమయంలో నిందితుడి వద్ద నుంచి మరో 5 నాటు తుపాకులు, 5 క్యాట్రిడ్జ్‌లు, ఒక దొంగతనం చేసిన కారు స్వాధీనం చేసుకున్నాం. నిందితుడు నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు." అని డీసీపీ పేర్కొన్నారు.